Indian railway: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్! హైదరాబాద్ నుంచి అమరావతికి హైస్పీడ్ రైలు!

  • ఇరు రాజధానుల మధ్య హైస్పీడ్ రైలుకు ప్రతిపాదనలు
  • ఇరు ప్రభుత్వాలు సుముఖత
  • ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే శాఖ

ఇటీవల జపాన్‌తో కలిసి హైస్పీడ్ రైలు మార్గానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. దేశంలో పలు సమస్యలుండగా హైస్పీడ్ రైలు అవసరమా? అన్న చర్చను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు రైల్వే శాఖ సరికొత్త ప్రతిపాదన పరిశీలిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి హైస్పీడ్ రైలు నడపాలన్నదే ఆ ప్రతిపాదన.

ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేయడంతో రెండు ప్రభుత్వాలు కన్సార్టియంగా ఏర్పడితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఉపరితల రవాణాశాఖతో రైల్వే శాఖ చర్చించి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తెలంగాణ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఏపీ ఎంపీ కేశినేని నానిలు కలిసి అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నెల 27 లేదంటే 28న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ వచ్చి మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ఇద్దరూ ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.  కాగా, ఇరు రాజధానుల మధ్య నడిచేది బుల్లెట్ రైలు కాదని, హైస్పీడ్ రైలని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.

 తాజా ప్రతిపాదన ప్రకారం మొదట హైదరాబాద్-విజయవాడల మధ్యనున్న 270 కిలోమీటర్ల దూరాన్ని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే మాదిరిగా 8 లేన్లుగా విస్తరిస్తారు. అదే సమయంలో హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం. రెండు రాజధానుల మధ్య రైలు, రోడ్డు అనుసంధానాన్ని పెంచి, అభివృద్ధి కారిడార్‌గా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.

More Telugu News