team india: ఉత్కంఠ భరిత పోరులో టీమిండియా విజయం.. టీ20 సిరీస్ భారత్ వశం!

  • టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా
  • అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా
  • పోరాడి ఓడిన న్యూజిలాండ్ జట్టు

టీమిండియా సత్తా చాటింది. న్యూజిలాండ్ ను రిక్తహస్తాలతోనే స్వదేశానికి పంపింది. తిరువనంతపురం వేదికగా జరిగిన పేటీఎం సిరీస్ చివరి టీ20మ్యాచ్ లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి విజయం సొంతం చేసుకుంది. తిరువనంతపురంలో వర్షం కురవడంతో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఎట్టకేలకు వర్షం ఆగడంతో నిమిషాల వ్యవధిలో కేరళ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ను రెడీ చేసింది.

 దీంతో 8 ఓవర్ల టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ కోరుకుంది. దీంతో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ధావన్ వికెట్ తీసి బౌల్ట్ షాకిచ్చాడు. వస్తూనే భారీ షాట్లకు ప్రయత్నించడంతో రోహిత్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. అనంతరం కెప్టెన్ కోహ్లీ ఫోర్, సిక్స్ తో ఆకట్టుకున్నాడు. అదే ఓవర్ లో ఐదో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.

 ఆ తరువాత శ్రేయస్ అయ్యర్ నిలబడలేకపోయాడు. మనీష్ పాండే భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేశాడు. పాండ్య ఒక సిక్సర్ బాదాడు. దీంతో 8 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అనంతరం 68 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 61 పరుగుల వద్ద చతికిలపడింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన గప్తిల్‌ (1)ని భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్ లోనే బౌల్డ్‌ చేశాడు.

రెండో ఓవర్లో బుమ్రా మూడే పరుగులిచ్చి ప్రమాదకర మన్రో (7)ను పెవిలియన్ కు పంపాడు. మూడో ఓవర్ లో చాహల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ తరువాత విలియమ్సన్ ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. విలియమ్సన్ (8) ఫిలిప్స్ (11), గ్రాండ్ హోం (17) ధాటిగా ఆడి జట్టుకు విజయం అందివ్వాలని పోరాడినా టీమిండియా బౌలర్ల ముందు ఆసీస్ ఆటగాళ్ల పప్పులుడకలేదు. దీంతో కేవలం 61 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. దీంతో టీమిండియా సిరీస్ లో విజయం సాధించింది. 

More Telugu News