tiruvananthapuram: తిరువనంతపురంలో తగ్గని వర్షం... నేటి మ్యాచ్ వర్షార్పణమే!

  • వర్షం తగ్గకుంటే మ్యాచ్ అనుమానమే
  • సాయంత్రం 4 తరువాత వర్షం పడకుండా ఉండాలి
  • అప్పుడే మ్యాచ్ జరుగుతుందంటున్న స్టేడియం నిర్వాహకులు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలు తడిసిముద్దవుతున్న నేపథ్యంలో.. కేరళలోని తిరువనంతపురంలో నేడు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చేలా జరగాల్సిన నిర్ణయాత్మక మూడో టీ-20పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక నిన్న తెరిపివ్వకుండా కురిసిన వర్షం ఈ రోజూ కొనసాగుతోంది. మైదానంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ, వర్షం ఆగినా, తిరిగి కురిసే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

వాతావరణ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికలు సైతం వర్షం కొనసాగే అవకాశాలే ఉన్నట్టు సూచిస్తున్నాయి. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమఉజ్జీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక కనీసం సాయంత్రం 4 గంటల తరువాత వర్షం కురవకుండా ఉంటే మాత్రమే, ఏడు గంటలకెల్లా మైదానం సిద్ధమవుతుందని గ్రౌండ్ సిబ్బంది చెబుతున్నారు.

వర్షపు నీటిని తోడేందుకు అరగంట సమయం పడుతుందని, ఆపై మైదానాన్ని ఆరబెట్టేందుకు గంటన్నర వరకూ సమయం పడుతుందని చెబుతున్నారు. ఈలోగా తిరిగి వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరిగేది అనుమానమేనని విశ్లేషకుల అభిప్రాయం. కాగా, గత నెలలో హైదరాబాద్ లో ఆస్ట్రేలియాపై జరగాల్సిన టీ-20 కూడా వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

More Telugu News