bangalore: బెంగళూరులో తాగి బుక్కైపోతున్న అమ్మాయిలు... కేసులు భారీగానే ఉంటున్నాయి!

  • బెంగళూరులో పెరుగుతున్న మద్యం తాగుతున్న యువతుల సంఖ్య  
  • గత ఏడాది డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 18 శాతం మంది మహిళలు 
  • ఈ ఏడాది 38 శాతం మంది మహిళలే! 

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా మద్యం తాగేవారిని కట్టడి చేయడం ఎవరివల్లా కావడం లేదు. ఈ క్రమంలో బెంగళూరు మహానగరంలో మద్యం తాగి, వాహనాలు నడిపే యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి సంఖ్య ఏడాది కాలంలో 18 శాతం నుంచి 38 శాతానికి పెరిగిపోయిందని తెలిపారు.

ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపటం నేరమని తెలిసీ యువతులు అదే పని చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో పోలీసులు వారిని ఆపితే, తమ నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు పోలీసు సిబ్బందితో గొడవ పడతారని, ఆ సందర్భాన్ని ఫోన్ లో రికార్డు చేసి, పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 శని, ఆదివారాల్లో ఇలా మద్యం తాగి డ్రైవ్ చేసేవారు పెరిగిపోతున్నారని వారు వెల్లడించారు. ప్రధానంగా బెంగళూరులోని ఎం.జి.రోడ్డు, కబ్బన్‌ పార్కు, రెసిడెన్సీ రోడ్డు, యుబి సిటీ, ఎలక్ట్రానిక్‌ సిటీ, కోరమంగల, హెబ్బాళ ప్రాంతాల్లో మద్యం తాగి యువతులు వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నారని వారు వెల్లడించారు.

గత ఏడాది డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో మద్యం తాగిన యువతుల సంఖ్య 18 శాతం ఉండగా, ఈ ఏడాది గణనీయంగా పెరిగి 38 శాతానికి చేరుకుందని తెలిపారు. దీంతో మహిళా ట్రాఫిక్ పోలీసులను రాత్రి విధుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. తాగి వాహనాలు నడిపిన యువతుల నుంచి జరిమానాలు, వాహనాలు స్వాధీనం చేసుకునేందుకు మహిళా సిబ్బంది సేవలు అవసరమని అన్నారు. ఇలా తాగి వాహనం నడిపేవారిలో స్థానికేతరులే ఎక్కువ మందని పోలీసులు వెల్లడించారు.

More Telugu News