student: ఒకే ఒక్క దివ్యాంగ‌ విద్యార్థిని కోసం లిఫ్ట్ ఏర్పాటు చేసిన పాఠ‌శాల‌

  • రూ. 14 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో లిఫ్ట్ ఏర్పాటు
  • రెండో అంత‌స్తులో ఉన్న ల్యాబ్‌ల‌కు వెళ్ల‌డం కోసం లిఫ్ట్‌
  • ఆనందం వ్య‌క్తం చేసిన విద్యార్థిని వ‌సు బ‌న్సాల్‌

కేవ‌లం త‌న కోస‌మే పాఠ‌శాల‌లో లిఫ్ట్ ఏర్పాటు చేసినందుకు పోలియో కార‌ణంగా చ‌క్రాల కుర్చీకే ప‌రిమిత‌మైన వ‌సు బ‌న్సాల్ చాలా ఆనందం వ్య‌క్తం చేసింది. మొహాలీలోని వివేక్ హై స్కూల్‌లో ప‌దేళ్లుగా వ‌సు విద్య‌న‌భ్య‌సిస్తోంది. ప్ర‌స్తుతం ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఆమెకు పై అంత‌స్తుల్లో ఉన్న ల్యాబ్‌ల‌కు వెళ్ల‌డం క‌ష్టంగా మారింది. వ‌సు బన్సాల్ సౌక‌ర్యార్థం రూ. 14 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి పాఠ‌శాల యాజ‌మాన్యం లిఫ్ట్ ఏర్పాటు చేయించింది.

త‌న గురించి ఆలోచించి లిఫ్ట్ సౌక‌ర్యం క‌ల్పించినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని వ‌సు బ‌న్సాల్ తెలిపింది. `ఇప్ప‌టి వ‌ర‌కు వ‌సు ఎక్క‌డికి వెళ్లాల‌న్నా ఒక ప‌నిమ‌నిషి ఆమెను మోసుకుని వెళ్లేది. అమ్మాయి ఎదుగుతుండ‌టంతో ఎత్తుకుని వెళ్ల‌డం ప‌నిమ‌నిషికి ఇబ్బందిగా మారింది. అందుకే గ‌త సంవ‌త్స‌ర కాలంగా వ‌సు పై అంత‌స్తుల్లో ఉన్న ల్యాబ్‌ల‌కు గానీ, పైన జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు గానీ హాజ‌రు కాలేక‌పోతోంది. వీల్‌చైర్ వెళ్ల‌డానికి వీలుగా ర్యాంప్ నిర్మించే స్థ‌లం లేక‌పోవ‌డంతో లిఫ్ట్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం` అని పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు అనురాధా దువా తెలిపారు. లిఫ్ట్ ఏర్పాటు చేయ‌డంపై వ‌సు తండ్రి రాజ్‌నీష్ బ‌న్సాల్‌, త‌ల్లి శివాని బ‌న్సాల్‌లు ఆనందం వ్య‌క్తం చేశారు.

More Telugu News