bullet train project: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు లోగోగా ఎంపికైన హైదరాబాద్ కుర్రాడి డిజైన్‌

  • చిరుత‌ను, బుల్లెట్ ట్రైన్‌ను అనుసంధానం చేస్తూ లోగో
  • అహ్మ‌దాబాద్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో చ‌దువుతున్న చ‌క్ర‌ధ‌ర్‌
  • కేంద్ర ప్ర‌భుత్వం నిర్వహించిన 30 లోగో పోటీల్లో పాల్గొన్న చ‌క్ర‌ధ‌ర్‌
  • త‌న డిజైన్ ఎంపిక‌ కావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన విద్యార్థి

కేంద్ర ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు (నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) లోగో కోసం mygov.in ద్వారా లోగో పోటీ నిర్వ‌హించింది. త‌మ డిజైన్ల‌ను పంపాల‌ని కోరుతూ వెబ్‌సైట్‌లో ప్ర‌క‌ట‌న ఇచ్చింది. ఈ పోటీకి పంపిన లోగోల్లో హైద‌రాబాద్ కుర్రాడు ఆళ్ల చ‌క్ర‌ధ‌ర్ గీసిన లోగో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అధికారిక లోగోగా ఎంపికైంది.

అహ్మదాబాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో చదువుకుంటున్న చక్రధర్, కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించిన 30 లోగో పోటీల్లో పాల్గొన్నాడు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు లోగోతో క‌లిపి చ‌క్ర‌ధ‌ర్ పాల్గొన‌డం 31వ సారి. ఈసారి విజ‌యం వ‌రించ‌డంతో చాలా ఆనందంగా ఉన్న‌ట్లు తెలిపాడు.

చిరుత‌పులి వేగాన్ని, బుల్లెట్ ట్రైన్ వేగంతో అనుసంధానిస్తూ చ‌క్ర‌ధ‌ర్ లోగో డిజైన్ చేశాడు. డిజైన్‌ చూడటానికి సింపుల్‌గా కనిపించినా దాని వెనుక అంతరార్థం చాలా క‌నిపిస్తోంది. చిరుత వేగానికి ప్రతీక కాగా, దానిపై ఉన్న రైలు ఆకారం నమ్మకానికి (వేగం+నమ్మకం) నిదర్శనమని చ‌క్ర‌ధ‌ర్ వివ‌రించాడు. చ‌క్ర‌ధ‌ర్ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. త‌ల్లి స్కూల్‌లో ప్రిన్సిపల్‌. లోగోలు తయారుచేయడంలో తనకు ఉన్న అమితాసక్తి కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు తనను ‘లోగోమ్యాన్‌’గా పిలుస్తుంటారని చక్రధర్‌ తెలిపారు.

More Telugu News