రేవంత్ ఆరోపణలపై తొలిసారి స్పందించిన యనమల... ఏమన్నారంటే..!

30-10-2017 Mon 15:32
  • ఏ కాంట్రాక్టు నాకున్నా తీసుకోవచ్చు
  • రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు
  • కమిషన్ లు వచ్చినా ఆయనే పుచ్చుకోవచ్చు
  • పోదామని అనుకున్నాకే విమర్శలన్న యనమల
తెలంగాణలో తనకు ఎటువంటి కాంట్రాక్టులు ఉన్నా, రేవంత్ రెడ్డి వాటిని ఒక్క రూపాయి తనకు ఇవ్వకుండా తీసుకోవచ్చని, ఒకవేళ, కాంట్రాక్టులపై కమిషన్ వచ్చినా తీసుకోవచ్చని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కాంట్రాక్టులను పొందారని ఏపీ అర్థికమంత్రి యనమలపై రేవంత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనపై రేవంత్ చేసిన ఆరోపణలపై ఈ మధ్యాహ్నం తొలిసారి స్పందించిన యనమల, తెలుగుదేశం పార్టీని విడిచి బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్న తరువాతే రేవంత్ ఇటువంటి ఆరోపణలు చేసినట్టు తాను భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇటీవల ఢిల్లీకి వెళ్లిన రేవంత్, రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తరువాత ఏపీ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. యనమల, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లు కేసీఆర్ నుంచి కాంట్రాక్టులు, లబ్ధి పొందారని ఆరోపించారు.