న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పుస్త‌కంపై మ‌రో వివాదం... అబ‌ద్ధాలు రాశాడ‌న్న మ‌రో మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్‌

30-10-2017 Mon 10:27
  • ఫేస్‌బుక్‌లో స్పందించిన న‌వాజుద్దీన్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ సునీత రాజ‌వార్‌
  • పేద వాడనే వంక‌తో త‌న‌ను సునీత‌ వ‌దిలేసింద‌న్న న‌వాజుద్దీన్‌
  • అలాంటిదేం లేద‌ని, మ‌హిళ‌ల‌ను చెడుగా వ‌ర్ణించాడ‌న్న సునీత రాజ‌వార్‌
ఇటీవ‌ల ర‌చ‌యిత రీతూప‌ర్ణ ఛ‌ట‌ర్జీతో క‌లిసి త‌న జీవిత క‌థ‌ను వివ‌రిస్తూ బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ రాసిన `యాన్ ఆర్డిన‌రి లైఫ్‌` పుస్త‌కంపై అత‌ని మ‌రో మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ న‌టి సునీత రాజ‌వార్ తీవ్రంగా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ పుస్త‌కంలో న‌వాజుద్దీన్ అన్ని అబ‌ద్ధాలే చెప్పాడ‌ని, మ‌హిళ‌ల‌దే త‌ప్పు అనే విధంగా వ‌ర్ణించాడ‌ని ఫేస్‌బుక్ పోస్టులో వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఈ పుస్తకంలో త‌ప్పుడు వ‌ర్ణ‌న‌లు ఉన్నాయంటూ, పుస్త‌కం అమ్మ‌కాల కోసం న‌వాజుద్దీన్ దిగ‌జారుడుత‌నం ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని మాజీ ప్రియురాలు నిహారిక సింగ్ బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

నేష‌నల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో న‌వాజుద్దీన్‌, సునీత రాజ‌వార్ చ‌దువుకున్నారు. అక్క‌డ న‌వాజుద్దీన్, సునీత‌కు సీనియ‌ర్‌. చ‌దువుకునే రోజుల్లో వారిద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలం ప్రేమ న‌డిచింద‌ని, తర్వాత ఒక‌రోజు ఆమె అక‌స్మాత్తుగా త‌న‌ను వ‌దిలి వెళ్లింద‌ని, నేను పేద‌వాడిని అవ‌డం, ఇంకా సినిమా ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నిస్తుండడ‌మే అందుకు కార‌ణ‌మ‌ని న‌వాజుద్దీన్ పుస్త‌కంలో పేర్కొన్నాడు. ఆమె అలా వెళ్ల‌డం వ‌ల్ల తాను డిప్రెష‌న్‌కి లోనై, ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపాడు.

అయితే ఆ మాట‌ల్లో నిజం లేద‌ని, తమిద్దరి మ‌ధ్య ప్రేమ లాంటిదేం లేద‌ని, తాను పేద‌వాడు అయినందుకు కాదు, అతని ఆలోచ‌న‌ల్లో పేద‌రికం ఉన్నందుకు వ‌దిలేశాన‌ని సునీత రాజ‌వార్ ఫేస్‌బుక్ పోస్టులో వివ‌రించింది. అంతేకాకుండా తమిద్దరి మ‌ధ్య జ‌రిగిన కొన్ని సంఘటనలను న‌వాజుద్దీన్ స్నేహితుల‌కు చెబుతూ జోకులు వేసేవాడ‌ని ఆమె ఆరోపించింది.