Revanth Reddy: రేవంత్ కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా!

షార్ట్స్‌లో చూడండి
టీడీపీని వీడిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 31న అంటే ఎల్లుండే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు మరో 20 మంది నేతలు కూడా రేవంత్‌తోపాటే కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

తనతో పాటు కాంగ్రెస్‌లో చేరే నేతలతో సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో రేవంత్ ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం ఢిల్లీ వెళ్లేందుకు విమాన టికెట్లను కూడా బుక్ చేసినట్టు సమాచారం. మంగళవారం రాహుల్ సమక్షంలో 20 మంది నేతలతో కలిసి కాంగ్రెస్‌లో చేరనున్న రేవంత్‌రెడ్డి మిగతా నేతలను రాహుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా చేర్పించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైంది. వారం రోజుల క్రితం రాహుల్‌గాంధీతో సమావేశమైనప్పుడే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఈ నెల 31న కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధమైనా అనుకోని కారణాల వల్ల సాధ్యం కాకపోతే, వచ్చే నెల 5న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తానేం చేయాలనేదానిపై ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి రేవంత్ వచ్చినట్టు తెలుస్తోంది.
 
Go Back to Shorts
Revanth Reddy
Congress
Rahul Gandhi
Telangana

More Telugu News