ration: బియ్యం బదులు డబ్బులిస్తే ఖజానాకు మిగిలేది రూ. 683 కోట్లు... గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న అధికారులు!

  • రేషన్ వ్యవస్థకు ఖర్చు రూ. 5,954 కోట్లు
  • లబ్దిదారులకు ఇవ్వాల్సింది 5,270 కోట్లు
  • మిగిలిపోనున్న బియ్యం రవాణా ఖర్చు
  • మొత్తం ఆదా రూ. 683 కోట్లు

కేసీఆర్ సూచించినట్టుగా రేషన్ బియ్యం బదులుగా నగదును లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ఖజానాలకు భారీ మొత్తంలో డబ్బు మిగులుతుందని అధికారులు తేల్చారు. వాస్తవానికి బియ్యం కొనుగోలు నుంచి దాన్ని రేషన్ షాపులకు చేర్చడం వరకూ కలిపి, చౌక ధరల దుకాణాల వ్యవస్థ నిర్వహణకు రూ. 5,954.25 కోట్ల వ్యయం అవుతుంది.

ఇక రాష్ట్రంలోని రేషన్ లబ్దిదారులను లెక్కించి ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున నగదు జమ చేయాలంటే, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 5,270 కోట్ల భారం పంచుకోవాలి. ఇందులో కేంద్రం వాటా రూ. 3,487.45 కోట్లు కాగా, రాష్ట్రం వాటా 2,466.90 కోట్లు. ఈ పథకం అమలు చేస్తే, బియ్యాన్ని కొనడం నుంచి రేషన్ షాపులకు తరలించేంత వరకూ పెడుతున్న రూ. 683.72 కోట్లు మిగులుతాయని అధికారులు లెక్క తేల్చారు. ఇక పథకం అమలుకు బ్యాంకు ఖాతాల అనుసంధానమే కీలకమని, దానికి కనీసం 9 నెలల సమయం పడుతుందని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించినట్టు తెలుస్తోంది.

More Telugu News