internet: కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం!

  • ప్రస్తుత కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లే
  • దాన్ని 2 మెగాబైట్లకు పెంచనున్న కేంద్ర ప్రభుత్వం
  • త్వరలోనే అధికారిక ఉత్తర్వులు
  • వెల్లడించిన టెలికం కార్యదర్శి అరుణా సుందరరాజన్

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం నానాటికీ పెరుగుతున్న వేళ, మరింత ప్రోత్సాహాన్ని అందించాలన్నఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లు కాగా, దాన్ని నాలుగు రెట్లు పెంచాలని నిర్ణయంచింది. ఇకపై కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 2 మెగాబైట్లుగా ఉండనుందని టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వెల్లడించారు. ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటోందని గ్రామీణ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని ఆయన అన్నారు.

3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని ఆయన అన్నారు. వైర్ లెన్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ పై కన్సల్టేషన్ పేపర్ ను ఇటీవల ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించిన తరువాత తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.

More Telugu News