బార్ పెడితే.. బీర్ల కంపెనీ అంటున్నారు: రేవంత్ పై పయ్యావుల కేశవ్ ఫైర్

23-10-2017 Mon 14:44
  • బార్ కు, బీర్ల కంపెనీకి తేడా ఏంటో రేవంత్ కు తెలుసు
  • కావాలనే తప్పుడు ఆరోపణలు
  • టీడీపీలో ఉంటూ, వైసీపీ నేతలతో కలసి తిరుగుతున్నారు
కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. తమపై అసత్య ఆరోపణలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల సునీత కుమారుడు, తన మేనల్లుడు కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బీర్ల కంపెనీని పెట్టారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పరిటాల కుటుంబంతో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని అన్నారు.

తన మేనల్లుడు అతని స్నేహితులతో కలసి బార్ ను పెడితే... బీర్ల కంపెనీ అంటున్నారని మండిపడ్డారు. బార్ కోసం దరఖాస్తు చేసుకుంటే... ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. రూ. 2 కోట్ల బార్ కు, రూ. 500 కోట్ల బీర్ల కంపెనీకి తేడా ఏంటో రేవంత్ కు తెలుసని... కానీ, కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. వ్యాపారాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం రేవంత్ కే చెల్లిందని తెలిపారు. టీడీపీలో ఉంటూనే తెలంగాణలో వైసీపీ నేతలతో కలసి రేవంత్ తిరుగుతున్నారని ఆరోపించారు.