maruti suzuki: ఆల్టోను మళ్లీ నెట్టేసిన డిజైర్

  • వరుసగా రెండో నెలలోనూ బద్దలైన ఆల్టో రికార్డు
  • సెప్టెంబర్ లో ఆల్టోతో పోలిస్తే 8 వేల యూనిట్లు ఎక్కువ అమ్ముడుపోయిన డిజైర్
  • టాప్-10 మోడల్స్ లో 6 మారుతి సుజుకివే

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఇంతకాలమూ నిలిచిన మారుతి సుజుకి ఆల్టో రికార్డు వరుసగా రెండో నెలలోనూ బద్దలైంది. మారుతి సుజుకి తయారు చేస్తున్న కాంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్ ఆగస్టులోలానే సెప్టెంబర్ లో సైతం ఆల్టోను వెనక్కు నెట్టింది. ఈ విషయాన్ని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) వెల్లడించింది.

సెప్టెంబర్ లో 23,830 ఆల్టో యూనిట్లు విక్రయించబడగా, 31,427 డిజైర్ యూనిట్ల అమ్మకాలు సాగాయని పేర్కొంది. ఇక సెప్టెంబర్ లో అత్యధిక అమ్మకాలు జరిగిన టాప్ 10 మోడళ్లలో 6 మారుతి సుజుకి మోడల్స్ ఉండటం గమనార్హం. మిగతా 4 మోడల్స్ హ్యుందాయ్, రెనోవి. ఇక ఎగుమతుల్లో సైతం మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకూ 57,300 కార్లను ఎక్స్ పోర్ట్ చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 6 శాతం అధికం. గత సంవత్సరం వరకూ ఎగుమతుల్లో మాత్రం ముందు నిలిచిన హ్యుందాయ్ మోటార్స్ ఈ నెలలో మందగించింది. హ్యుందాయ్ ఎగుమతులు 30 శాతం వరకూ తగ్గాయి. ఇక బైక్ ల విషయానికి వస్తే, హీరో మోటో తొలిస్థానాన్ని కొనసాగించగా, బజాజ్ ఆటోను వెనక్కు నెట్టి హోండా రెండో స్థానానికి చేరుకుంది. స్కూటర్ విక్రయాల్లో మాత్రం హీరో ఆధిపత్యానికి టీవీఎస్ గండికొట్టింది.

More Telugu News