nagarjuna sagar: ఐదేళ్లుగా నిలిచిన సాగర్ - శ్రీశైలం లాంచ్ ప్రయాణం తిరిగి ప్రారంభం... విశేషాలివి!

  • లాంచీ ప్రయాణానికి సరిపడా నీరు
  • మూడున్నర గంటలు సాగనున్న ప్రయాణం
  • పర్యాటకులకు వినూత్న అనుభూతినందించే ప్రయాణం

ధవళేశ్వరం నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకూ లాంచీలో ప్రయాణిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గోదావరి నదిపై ధవళేశ్వరం నుంచి లాంచీల్లో నిత్యమూ ప్రయాణానికి అవకాశముంటుంది. దారి మధ్యలో ఎన్నో లంక గ్రామాలకు నదీ ప్రయాణమే ఆధారం కాబట్టి. కానీ, కృష్ణా నదిపై అలా కాదు. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీలు వెళ్లే సౌకర్యం ఉన్నా, అది నీరు నిండా ఉంటేనే సాధ్యం. కొండల మధ్య సాగర్ నుంచి శ్రీశైలానికి ప్రయాణిస్తుంటే, ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది.

అయితే, గడచిన ఐదేళ్లుగా సాగర్ కు పూర్తి స్థాయి వరదనీరు రాకపోవడంతో లాంచీ ప్రయాణమూ నిలిచింది. ఈ సంవత్సరం కృష్ణమ్మకు భారీగా వరద రావడం, ప్రస్తుతం నీరు 570 అడుగులను దాటడంతో నాగసిరి లాంచీ ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసిన పర్యాటక శాఖ అధికారులు, తిరిగి లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు సాగర్ నుంచి బయలుదేరే లాంచ్, మూడున్నర గంటల ప్రయాణం అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీశైలం చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.30కి సాగర్ చేరుకుంటుంది.

ఇక ఈ ప్రయాణానికి ప్రత్యేక ప్యాకేజీలూ అందుబాటులో ఉంటాయి. సాగర్ నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్లిన తరువాత పర్యాటకులకు బస, మల్లన్న దర్శనం, స్థానిక క్షేత్రాల సందర్శన వంటి ఏర్పాట్లను టూరిజం శాఖ చూసుకుంటుంది. తిరిగి సాగర్ రావాలంటే మరుసటి రోజు అదే లాంచీలో రావచ్చు. లేదనుకుంటే శ్రీశైలం నుంచి తమ తమ గమ్యస్థానాలకు వేరే ప్రయాణ సాధనాల్లో వెళ్లిపోవచ్చు. సాగర్ జలాశయంలో నీటిమట్టం లాంచీ ప్రయాణానికి సరిపడా ఉందని, త్వరలోనే లాంచ్ సేవలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News