Amaravathi: ‘అమరావతి’ శంకుస్థాపనకు నేటితో రెండేళ్లు.. చురుగ్గా సాగుతున్న పనులు

  • రెండేళ్ల క్రితం ఇదే రోజున శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
  • చురుగ్గా సాగుతున్న పనులు
  • ఓసారి సింహావలోకనం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటితో సరిగ్గా రెండేళ్లు కావొస్తోంది. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2050 నాటికి ప్రపంచంలోని మేటి నగరాల్లో ఒకటిగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ఈ రెండేళ్లలో అమరావతిలో జరుగుతున్న పనుల తీరును ఒక్కసారి పరిశీలిస్తే..

రాజధానికి గుండెకాయలాంటి సీడ్ క్యాపిటల్‌ 1694 హెక్టార్లలో కీలక ప్రాంతం. ఐదు దశల్లో అభివృద్ధి చేయనున్న దీనిలో మూడు లక్షలమంది  జనాభా నివసించేలా నిర్మించనున్నారు. సీడ్ క్యాపటిల్ అభివృద్ధికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రధాన పరిపాలనా నగరానికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే ఓకే అయినట్టు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయానికి వెళ్లి డిజైన్లను పరిశీలించనున్నారు.

రాష్ట్రం విడిపోయాక ఏపీకి కేంద్రం కేటాయించిన 15 సంస్థలకు ఇప్పటి వరకు స్థలాలు కేటాయించకపోవడంతో వాటి కార్యకలాపాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఇక మంగళగిరి వద్ద 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1684 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘ఎయిమ్స్’ పనులను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎస్ఆర్ఎం, విట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు అమరావతిలోని తమ యూనివర్సిటీల్లో ఇప్పటికే తరగతులను ప్రారంభించాయి. మంగళగిరిలో పై డేటా సెంటర్, పై కేర్ సర్వీసులు ఏర్పాటయ్యాయి. రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడు సీడ్ యాక్సెస్ రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతోంది. రూ.53 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 
Amaravathi
Andhrapradesh
capital
Chandrababu

More Telugu News