apsrtc: బస్సుకు బ్రేక్ వేసి స్టీరింగ్ పై వాలిపోయిన డ్రైవర్!

  • ఎస్ కోట నుంచి విజయనగరం బయల్దేరిన బస్సు
  • ధర్మవరం పరిసరాల్లోకి వచ్చేసరికి డ్రైవర్ కు ఛాతి నొప్పి
  • క్షణాల్లో బస్సుకు బ్రేక్ వేసి స్టీరింగ్ పై వాలిపోయిన డ్రైవర్

ప్రయాణికుల ప్రాణాలు తన చేతుల్లో ఉన్నాయన్న స్పృహతో.. ఓపక్క ఛాతి నొప్పి వచ్చినా బస్సుకు చాకచ్యంగా బ్రేక్ వేసి.. అనంతరం స్టీరింగ్ పై డ్రైవర్ వాలిపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. శృంగవరపుకోట (ఎస్.కోట) నుంచి విజయనగరం వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ధర్మవరం పరిసరాల్లోకి వచ్చేసరికి డ్రైవర్ శ్రీనుకి ఛాతిలో నొప్పి వచ్చింది. సెకెన్ల వ్యవధిలో అది తీవ్రరూపం దాల్చడంతో ప్రయాణికుల రక్షణార్థం బ్రేక్ వేసి బస్సుని ఆపి, అలాగే స్టీరింగ్ పై విలవిల్లాడుతూ వాలిపోయాడు.

దీంతో అధికారులకు సమాచారం ఇచ్చిన ప్రయాణికులు వెంటనే వేరే వాహనంలో శృంగవరపుకోట ఆసుపత్రికి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, నిన్న గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో బస్సు నడుపుతున్న డ్రైవర్‌ కు గుండెపోటు రావడంతో బస్సులోనే మృతి చెందగా, ఆ సమయంలో అదుపుతప్పిన బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మరో ఇద్దరు మృతి చెందారు. అలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా డ్రైవర్ శ్రీను చాకచక్యంగా వ్యవహరించాడు. 

More Telugu News