tirumala: వారాంతం రాకుండానే కిక్కిరిసిన తిరుమల గిరులు!

  • ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ
  • దర్శనానికి 10 గంటల సమయం
  • కపిలేశ్వరుని సన్నిధిలో పెరిగిన రద్దీ
  • కార్తీకమాసం ప్రారంభం కావడంతో వేలాది మంది పుణ్యస్నానాలు

వరుస సెలవుల నేపథ్యంలో వారాంతం రాకుండానే తిరుమల గిరులు కిక్కిరిసి పోయాయి. దీపావళి, ఆపై కార్తీక మాస ప్రారంభం, వారాంతం కలసిరావడంతో శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. నిన్న దీపావళి సందర్భంగా కొంచెం పల్చగానే భక్తులు కనిపించినప్పటికీ, ఈ ఉదయం పరిస్థితి మారిపోయింది. రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు కొండపైకి వచ్చారు.

ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. ఈ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య క్యూలైన్లలోకి ప్రవేశించే భక్తులకు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య దర్శనం కలుగుతుందని అన్నారు. కంపార్టుమెంట్లలోని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్న ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక దర్శనం భక్తులకు 3 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయంలో దర్శనం లభిస్తోంది.

ఇక నిన్న 67,569 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 29,347 మంది తలనీలాలను సమర్పించుకోగా, రూ. 2.73 కోట్ల ఆదాయం హుండీ ద్వారా లభించింది. ఇదిలావుడంగా తిరుపతిలో కపిలేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కపిలేశ్వరుని దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు కపిలతీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. 

More Telugu News