Amaravathi: వీటిని చూసి మీ అభిప్రాయం చెప్పండి.. అమరావతి 'అసెంబ్లీ' డిజైన్లను సోషల్ మీడియాలో విడుదల చేసిన సీఆర్‌డీఏ!

  • కొత్తగా 13 రకాల డిజైన్లను రూపొందించిన నార్మన్ ఫోస్టర్
  • ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో విడుదల
  • వారం రోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనం కోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ 13 రకాల డిజైన్లను రూపొందించి, ప్రజాభిప్రాయం కోసం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇటీవల ఈ సంస్థ రూపొందించిన వజ్రాకృతి, స్థూపాకృతి డిజైన్లను ప్రభుత్వం తొలుత ఖరారు చేసినా తర్వాత తిరస్కరించడంతో మళ్లీ పలు రకాల డిజైన్లు రూపొందించారు. మరింత మెరుగైన డిజైన్ల కోసం ఇటీవల టాలీవుడ్ దర్శకుడు రాజమౌళిని ప్రభుత్వం రంగంలోకి దించింది.

మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్, రాజమౌళి కలిసి లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ డిజైన్లు ఎలా ఉండాలో రాజమౌళి సలహాలిచ్చారు. దీంతో ఆయన సలహాలు, సూచనల మేరకు సంస్థ కొత్తగా మరో 13 డిజైన్లను రూపొందించింది. సీఆర్‌డీఏఈ డిజైన్లను ఫేస్‌బుక్, ట్విట్టర్‌తోపాటు తమ వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజాభిప్రాయాన్ని కోరింది. అభిప్రాయాల వెల్లడికి వారం రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 25, 26 తేదీల్లో లండన్‌లో మరికొన్ని డిజైన్లను పరిశీలించనున్నారు.

More Telugu News