america: పాక్ పై నిఘా ఉంచడంలో భారత్ సాయం కావాలి: అమెరికా

  • ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే ఊరుకోం
  • ఎలాంటి చర్యలకైనా సిద్ధమే
  • మా కొత్త విధానాన్ని భారత్, పాక్ లు అర్థం చేసుకోవాలి

ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుండటం పట్ల తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా ఉన్నారని... ఈ నేపథ్యంలో, ఆ దేశంపై నిఘా ఉంచే విషయంలో భారత్ తమకు సహకరించాలని ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలి కోరారు. ఆఘ్ఘనిస్థాన్, దక్షిణాసియా దేశాల్లో ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో ట్రంప్ కొత్త కార్యాచరణను చేపట్టారని... అందులో ముఖ్యమైనది భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యమని చెప్పారు. ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన ప్రాంతాలపై ఉక్కుపాదం మోపడమే తమ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వస్త్రాలు వెళ్లకుండా చేయడం చాలా ముఖ్యమని... దీన్ని సాధించడానికి అన్ని విధాలైన ఆర్థిక, దౌత్య, సైనిక చర్యలకు తాము సిద్ధమేనని చెప్పారు.

ఆర్థిక, రక్షణ రంగాల్లో భారత్ తో మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతామని హేలీ తెలిపారు. పాకిస్థాన్ కూడా తమకు కీలక భాగస్వామేనని చెప్పిన హేలీ... ప్రస్తుతమున్న పాక్ ప్రభుత్వం కాని, లేదా వేరే ప్రభుత్వం కానీ ఉగ్రవాదులకు సహకారం అందిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ కొత్త విధానాన్ని భారత్, పాక్ లు రెండూ అర్థం చేసుకోవాలని కోరారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ లు మంచి పొరుగు దేశాలని కితాబిచ్చారు.

More Telugu News