secunderaba: సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరో వంతెన, రెండు లిఫ్టులు

  • నెల రోజుల్లో శంకుస్థాపన
  • ముంబైలాంటి ఘటనలు జరగకుండా చర్యలు
  • అందుబాటులోకి వస్తే గణనీయంగా తగ్గనున్న రద్దీ

సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్తే. అతి త్వరలో ఓ వంతెన, రెండు లిఫ్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. పండుగ వేళ్లలో రద్దీని తట్టుకోవడంతోపాటు, ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రైల్వే స్టేషన్‌లో జరిగిన దుర్ఘటనలాంటి ఘటనలు జరగకుండా నివారించే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. మరో నెలరోజుల్లోనే వీటికి శంకుస్థాపన చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 1.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. 238 రైళ్లు పరుగులు తీస్తుంటాయి. ఇక  పండుగలు, పబ్బాలప్పుడు రద్దీ అమాంతం పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జీలు కిటకిటలాడుతుంటాయి. ఒక్కోసారి రద్దీ పెరిగి తోపులాటలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో ముంబైలో జరిగిన ఘటన లాంటిది మరొకటి జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వీటిని నిర్మాణానికి ముందుకొచ్చారు.

ఇటీవల ముంబైలోని  ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు రైల్వేస్టేషన్‌ వంతెన వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రస్తుతం నిర్మించనున్న నాలుగో వంతెన ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా ముంబై ప్రమాదంతో కార్యరూపం దాల్చబోతోంది.  

ప్రస్తుతం స్టేషన్‌ బయటకు వెళ్లేందుకు ఒక్క వంతెన కూడా లేకపోవడంతో కొత్త బ్రిడ్జిని రెండువైపులా దారి తీసేలా రేతిఫైల్ బస్‌స్టేషన్ సమీపంలో నిర్మించనున్నారు. దీనివల్ల ఎంఎంటీఎస్ ప్రయాణికులు నేరుగా స్టేషన్ బయటకు చేరుకోవచ్చు. ఫలితంగా స్టేషన్‌లో రద్దీ తగ్గుతుంది. అలాగే ప్రస్తుతం 1, 10 ప్లాట్‌ఫారాల్లో హైదరాబాద్ వెళ్లే వైపు రెండు లిఫ్టులు అందుబాటులో ఉండగా, కాచిగూడ వైపు ఉన్న మూడో వంతెనకు ఇదే ప్లాట్‌ఫారాల్లో మరో రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల మధ్యలో ఉన్న బ్రిడ్జిపై భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. లిఫ్ట్‌ల ఏర్పాటు పని ఇప్పటికే పూర్తికావచ్చిందని, చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.

More Telugu News