Bank details: ఆన్ లైన్లో రూ. 500కు బ్యాంకు ఖాతాల వివరాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్... కాగ్నిజెంట్, హెచ్డీఎఫ్సీ ఉన్నతాధికారుల హస్తం!

  • సీవీవీ సహా అన్ని వివరాలు ఇస్తున్న ముఠా
  • అసలు వ్యక్తి పాక్ జాతీయుడు, సహకరిస్తున్న ఇక్కడి వారు
  • దందాను బట్టబయలు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు

రూ. 500కు భారతీయుల బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఆన్ లైన్లో విక్రయిస్తున్న ముఠా దందాను మధ్యప్రదేశ్ పోలీసులు బట్టబయలు చేశారు. బ్యాంకు ఖాతా సంఖ్య, ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ తదితర వివరాలన్నీ వీరు అమ్ముతున్నట్టు మధ్యప్రదేశ్ సైబర్ సెల్ పోలీసులు పేర్కొన్నారు. లాహోర్ కేంద్రంగా ఓ పాక్ జాతీయుడు ఈ దందాను ఇండియాలో మొదలుపెట్టగా, ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కు చెందిన టెక్కీతో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నతోద్యోగి సహాయాన్ని అందించారని, వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

తమకందిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా, ఓ కస్టమర్ రూపంలో ఇండోర్ కు చెందిన మహిళ  డెబిట్ కార్డు వివరాలను కోరి, ఆ వివరాలు ఇస్తే బిట్ కాయిన్స్ ఇస్తామని చెప్పగా, ఇద్దరు వ్యక్తులు ట్రాప్ లో పడ్డారని, వారిని ముంబైలో అరెస్ట్ చేయగా మొత్తం దందా బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆగస్టు 28న జైకిషన్ గుప్తా అనే వ్యక్తి తన డెబిట్ కార్డు నుంచి రూ. 72,401 పోయాయని ఇచ్చిన ఫిర్యాదుపై విచారించగా, ఈ వివరాలు తెలిశాయని అన్నారు. ఈ కార్డుతో ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తుల పేర్లపై విమానం టికెట్లు కొన్నారని, అదే కేసు ఛేదించేందుకు కీలక సమాచారాన్ని ఇచ్చిందని అన్నారు.

More Telugu News