china: చైనా దొరికిపోయింది... రహస్య సాంకేతిక సమాచారాన్ని తస్కరించిందని నిర్ధారణ!

  • ఆస్ట్రేలియా వైమానిక దళం కంప్యూటర్లను హ్యాక్ చేసిన చైనీయుడు
  • బీజింగ్ లో రెండు కంపెనీలు ఏర్పాటు చేసిన చైనీయుడు
  • ఒక కంపెనీ పని విదేశాల సైనిక రహస్యాలను దొంగిలించడమే
  • ఆస్ట్రేలియా స్టెల్త్ విమానాల తయారీ రహస్యాలను దొంగిలించి చైనాకు విక్రయించిన సు బిన్

చైనా అసలు నైజం బట్టబయలైంది. ఇతర దేశాల రహస్య ఆయుధ తయారీ వివరాలను హ్యాకింగ్ ద్వారా దొంగతనం చేయడం ఆ దేశానికి బాగా అలవాటు. ఈ క్రమంలో అగ్రదేశాలు అద్భుత ఆయుధంగా పేర్కొనే ‘స్టెల్త్‌ టెక్నాలజీ’ని ఆస్ట్రేలియా నుంచి చైనా దొంగతనం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్‌-35 స్టెల్త్‌ జెట్‌, పి-8 నిఘా విమానాల సమాచారాన్ని ఏడాది క్రితం దొంగిలించింది.

కెనడాలో నివసించే చైనాకు చెందిన సు బిన్‌ (50) ఈ టెక్నాలజీ అపహరణకు మూల కారకుడని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ధారించింది. ఇతనికి లోడ్‌ టెక్నాలజీ పేరుతో బీజింగ్‌ లో ఒక కంపెనీతో పాటు ఒక హ్యాకింగ్‌ సంస్థ కూడా ఉంది. ఈ హ్యాకింగ్ సంస్థ వివిధ దేశాల సైనిక సమాచారాన్ని హ్యాక్‌ చేస్తుంటుంది. ఈ సంస్థకు చైనా సైనికాధికారుల మద్దతు ఉండడం విశేషం.

ఆస్ట్రేలియా స్టెల్త్ విమానాల సమాచారాన్ని తస్కరించేందుకు సు బిన్ ‘చైనా చాపర్‌’ టెక్నిక్‌ ను వాడాడు. ఈ విధానంలో పరిచయస్తుల పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపాడు. వాటిని తెరవగానే వారి కంప్యూటర్ లోకి వైరస్ చొరబడి అందులోని సమాచారాన్ని తస్కరించేవి. అక్కడి నుంచి మరో కంప్యూటర్ లోకి, అక్కడి నుంచి మరో కంప్యూటర్ లోకి ఇలా అవసరమైన సమాచారం మొత్తం సేకరించారు.

 గత ఏడాది జులైలో ఆస్ట్రేలియా వైమానిక దళానికి చెందిన దాదాపు 30 గిగాబైట్ల డేటా సమాచారాన్ని సు బిన్ చైనా సైన్యానికి విక్రయించాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సిగ్నల్స్‌ డైరెక్టరేట్‌ నవంబర్‌ నెలలో గానీ గుర్తించలేకపోయింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికా ఆయుధ చట్టం కింద నిషేధించిన సమాచారాన్ని సు బిన్‌ బృందం అపహరించింది.

వీటిల్లో స్మార్ట్‌ బాంబ్స్‌ సాంకేతిక సమాచారం, జాయింట్‌ స్ట్రయిక్‌ ఫైటర్స్‌ వివరాలు, పొసిడాన్‌ నిఘా విమాన పెట్రోలింగ్‌ సమాచారం, యుద్ధ నౌకల సమాచారం చైనా హ్యాకర్లకు చిక్కింది. అయితే, ఆస్ట్రేలియా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద సబ్‌ మెరైన్‌ ప్రాజెక్టు వివరాలు హ్యాకర్ల బారిన పడ్డాయా? లేదా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో కాపీ పేస్టు తరహాలో చైనా నిపుణులు స్టెల్త్ విమానాలు తయారు చేయడం ప్రారంభించారు. ఈ విమానాలను చైనా తన సైన్యానికి అందించిన సంగతి తెలిసిందే.

More Telugu News