bangladesh: ఒక్క క్రికెట్ మ్యాచ్ లో మూడు వరల్డ్ రికార్డులు బద్దలయ్యాయి!

  • బంగ్లాదేశ్ పై ఘన విజయం
  • వికెట్ నష్టపోకుండా అత్యధిక పరుగుల ఛేదన
  • సౌతాఫ్రికాపై తొలి బంగ్లాదేశ్ ఆటగాడి సెంచరీ కూడా

బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే క్రికెట్ పోటీలో దక్షిణాప్రికా విజయం సాధించింది. మామూలుగా అయితే, ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఉండదు. ఒకప్పుడు పసికూనలుగా, తమదైన రోజు వస్తే మాత్రమే ప్రత్యర్థి జట్టును ఓడించడం తప్ప, పెద్దగా రాణించిన చరిత్రలేని బంగ్లాదేశ్ జట్టు, ఇటీవలి కాలంలో మెరుగైన స్థితికి చేరుకుని దిగ్గజ జట్లకే ఎదురు నిలిచే స్థాయికి చేరుకుంది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోని జట్టు ఇప్పుడు లేదు.

ఈ నేపథ్యంలో, శ్రీలంక, వెస్టిండీస్ తదితర జట్లతో పోలిస్తే, మెరుగైన ర్యాంకింగ్స్ లో ఉన్న బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 278 పరుగులు చేయగా, సౌతాఫ్రికాపై తొలి సెంచరీ చేసిన బంగ్లా ఆటగాడిగా ముష్ఫికర్ రెహమాన్ రికార్డు సృష్టించాడు. ఆపై 279 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మరో 43 బంతులు మిగిలి వుండగానే వికెట్ నష్టపోకుండా 282 పరుగులు సాధించింది.

వన్డే చరిత్రలో వికెట్ నష్టపోకుండా ఛేదించబడిన అత్యధిక లక్ష్యమిదే. ఓపెనర్లు డికాక్ 168, ఆమ్లా 110 పరుగులు సాధించారు. ఇక తొలి వికెట్ కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేసిన దక్షిణాఫ్రికా జంటగానూ ఆమ్లా, డికాక్ నిలిచారు. వన్డే పోటీల్లో వేగంగా 5 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన తొలి ఆల్ రౌండర్ గా ఈ మ్యాచ్ తరువాత షకీబ్ అల్ హసన్ రికార్డు నెలకొల్పాడు. 178 మ్యాచ్ లలోనే షకీబ్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

More Telugu News