విజయవాడ: మన పిల్లలకు ఎంత సంస్కారం నేర్పిస్తామనేది ముఖ్యం: సీఎం చంద్రబాబు

  • విజయవాడలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం
  • విద్యార్థినీ, విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి
  • పిల్లలకు ఎన్ని ఆస్తులు, ఎంత భూమి ఇస్తామనేది ముఖ్యం కాదు
  • రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకే ప్రాధాన్యమన్న చంద్రబాబు

మన పిల్లలకు ఎంత సంస్కారం నేర్పిస్తామనేది ముఖ్యమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ, అబ్దుల్ కలాం పుట్టినరోజున ప్రతిభా అవార్డు పురస్కారాలు ఇవ్వడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టానని అన్నారు.

‘నేను ఒకటే నమ్ముతాను. రాబోయే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీకే ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడం లేదు..ఇరవై సంవత్సరాలుగా చెబుతున్నాను. మన పిల్లలకు మనం ఎన్ని ఆస్తులు ఇస్తాం, ఎంత భూమి ఇస్తామనేది ముఖ్యం కాదు. మన పిల్లల్ని ఎంత బాగా చదివిస్తాం, ఎంత మంచి సంస్కారం నేర్పిస్తాం అనేది ముఖ్యం. చదువు.. తెలివినిస్తుంది, ఏదైనాసరే, సాధించే శక్తినిస్తుంది. అదే సమయంలో, సంస్కారం భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున మనం ఆనందంగా ఉండాలంటే డబ్బు ఎంత ముఖ్యమో, మన సంప్రదాయాలని, మన కుటుంబ వ్యవస్థను, అదే మాదిరిగా మనకున్న విలువలను మనం కాపాడుకోవడం అంతకన్నా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి. పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడుతున్నారు’ అని ప్రశంసించారు.

‘నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆరోజు ఓ నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్క కిలోమీటర్ దూరంలో ఎలిమెంటరీ స్కూల్ , మూడు కిలోమీటర్ల దూరంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ , ఐదు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కళాశాల, అదే విధంగా రెవెన్యూ డివిజన్ కు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రయత్నం చేశాను. కాలేజీలు పెడితే లాభం లేదు, అందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలను ప్రమోట్ చేశాను. ఐటీ కంపెనీలు ప్రమోట్ చేసిన తర్వాత మనవాళ్లు వేరే దేశాలకు వెళ్లారు. ప్రపంచంలో 25 శాతం ఐటీ ఇంజనీర్లు మన వాళ్లు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజున నేను వేసిన విత్తనమే. అదే సమయంలో మరోటి ఆలోచించాను, ఉద్యోగాలతో తృప్తిపడకుండా..పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆరోజున ఓ మెస్సేజ్ ఇచ్చా’ అని అన్నారు.

More Telugu News