saudi arabia: భార్య ముచ్చట, మామ కోరిక తీర్చేది లేదంటూ పెళ్లి రద్దు చేసుకున్న సౌదీ వరుడు!

  • స్థానిక యువతితో వివాహానికి సిద్ధమైన సౌదీవరుడు
  • నిఖా సందర్భంగా తన కుమార్తెను డ్రైవ్ చెయ్యనివ్వాలని కోరిన వధువు తండ్రి
  • వివాహం రద్దు చేసుకుని ఇంటికెళ్లిపోయిన వరుడు

భార్యముచ్చట, మామగారి కోరిక తీర్చేది లేదని చెబుతూ సౌదీకి చెందిన వరుడు పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. సౌదీఅరేబియాకు చెందిన యువకుడితో, అదే ప్రాంతానికి చెందిన యువతికి వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. వారి వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపాగితే వివాహతంతు పూర్తయ్యేదే... ఇంతలో తన కుమార్తె ముచ్చట తీర్చాలని వధువు తండ్రి వరుడిని ఒక కోరిక కోరాడు.

తన కుమార్తెను కారు డ్రైవింగ్ చెయ్యనివ్వాలని అల్లుడిని ఆయన కోరారు. దీంతో అతనిపై అంతెత్తున లేచిన అల్లుడు తక్షణం వివాహాన్ని రద్దు చేసుకుని, వెళ్లిపోయాడు. ఎంతమంది సర్దిచెప్పినా వరుడు వినిపించుకోకపోవడం విశేషం.

కాగా, గతవారం సౌదీ రాజు ప్రకటన చేసేంత వరకు.. ప్రపంచ దేశాల్లో స్త్రీలు డ్రైవ్ చేయకూడని ఏకైక దేశంగా సౌదీఅరేబియా ఉండేది. సౌదీరాజు సాల్మన్ గతవారం 2018 జూన్ నుంచి సౌదీ అరేబియాలో మహిళలు కూడా డ్రైవింగ్ చేసేందుకు అనుమతినిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఇకపై సౌదీ అరేబియాలో మహిళలు కూడా డ్రైవింగ్ చేయవచ్చన్న సంగతి తెలిసిందే. 

More Telugu News