EC: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించని ఈసీ.. ప్రతిపక్షాలు గరం గరం!

  • హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ప్రకటించి గుజరాత్‌ను విత్‌హోల్డ్‌లో పెట్టిన ఈసీ
  • మోదీ ప్రభుత్వం ఒత్తిడే కారణమంటున్న ప్రతిపక్షాలు
  • వివరణ ఇవ్వాలని డిమాండ్

హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నగరా మోగించిన ఎన్నికల సంఘం హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి, గుజరాత్ షెడ్యూల్‌ను విడుదల చేయకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘంపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయించిందని ఆరోపిస్తున్నాయి.

తన రాజకీయ స్వప్రయోజనాలు నెరవేరే వరకు ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసేలా ప్రధాని మోదీ ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ రణ్‌దీప్ సూర్జేవాలా ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను వచ్చే నెల 9న నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. నిజానికి రెండు రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని భావించారు. అయితే గురువారం ఉదయం ఎన్నికల నగారా మోగించిన ఈసీ సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్‌కు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించింది.

ఆ తర్వాత ఈసీ మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికలను డిసెంబరు 18లోపు పూర్తి చేస్తామని పేర్కొంది. అప్పటికి హిమాచల్ ‌ప్రదేశ్ ఫలితాలు వచ్చేస్తాయని తెలిపింది. ఈ నెల 16న ప్రధాని మోదీ గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓటర్లపై వరాల జల్లు కురిపించేందుకు అనువుగానే షెడ్యూల్‌ ప్రకటనను వాయిదా వేశారని సూర్జేవాలా ఆరోపించారు. ఎన్సీపీ నేత డీపీ త్రిపాఠీ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎందుకు విత్‌హోల్డ్‌లో పెట్టిందీ ఈసీ చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. పోల్ ప్యానల్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణమని అన్నారు.

More Telugu News