kidnap: సిరిచందనను భర్తకు అప్పగించిన పోలీసులు...కిడ్నాప్ కథ సుఖాంతం!

  • సోమవారం కిడ్నాప్ కు గురైన సిరిచందన
  • చంద్రగిరి ప్రభుత్వాసుపత్రిలో హౌస్ సర్జన్ గా పని చేస్తోంది  
  • సిరిచందనను భర్త నవీన్ కుమార్ కు అప్పగించిన పోలీసులు

చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ప్రభుత్వ రూరల్‌ హెల్త్‌ సెంటర్‌లో హౌస్‌ సర్జన్‌ గా పనిచేస్తున్న సిరిచందన కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఆమెను భర్త నవీన్ కుమార్ కు అప్పగించిన పోలీసులు, రెండు ఇన్నోవాలను స్వాధీనం చేసుకుని, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే... తిరుపతికి చెందిన నవీన్‌ కుమార్‌, సిరిచందన రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో గత ఆగస్టు 16న కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వారికి బెదిరింపులు ఆరంభమయ్యాయి. దీంతో వారిద్దరూ ఎస్పీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రెండు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు.

అయినప్పటికీ తీరు మార్చుకోని సిరిచందన తల్లిదండ్రులు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సిరిచందనను కిడ్నాప్ చేయించారు. విధులు నిర్వహించి ఇంటికి వెళ్తున్న నవీన్‌ కుమార్‌, అతని సోదరి రేవతి, భార్య సిరిచందనను ఆమె తల్లిదండ్రులు తమ వర్గం సాయంతో ఇన్నోవా కార్లలో వచ్చి తొండవాడ సమీపంలో అడ్డగించి, కళ్లలో కారం చల్లి దాడి చేశారు.

స్థానికులు కల్పించుకుని, వారిని అడ్డుకోవడంతో సిరిచందనను మాత్రం తీసుకుని వెళ్లిపోయారు. దీంతో నవీన్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి, సిరిచందనను గుర్తించి, కిడ్నాప్ కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సిరిచందనను భర్తకు అప్పగించారు. 

More Telugu News