Jay shah: అమిత్ షా కుమారుడిపై ‘ద వైర్’ మరో సంచలన కథనం!

  • కథనం ప్రచురించడానికి ముందే న్యాయశాఖ వద్ద పావులు
  • వాదించేందుకు తుషార్ మెహతాకు న్యాయశాఖ అనుమతి
  • చట్టవిరుద్ధమని మరో వార్త ప్రచురించిన వెబ్  సైట్
  • అగ్గిమీద గుగ్గిలమవుతున్న విపక్షాలు

బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడు జై షాపై ఇప్పటికే ఓ కథనాన్ని ప్రచురించి ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టించిన ‘ద వైర్’ వెబ్ సైట్ మరో సంచలన కథనంతో ముందుకొచ్చింది. జై షాపై తాము కథనాన్ని ప్రచురించడానికి ముందే జైషాకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరిందంటూ మరో కథనం ప్రచురించింది. తాము ఈనెల 8న ఆయనపై వార్త రాస్తే ప్రభుత్వం ఈనెల 6 అంటే రెండు రోజుల ముందే పరువునష్టం కేసులో ఆయన తరపున వాదించేందుకు కేంద్ర న్యాయశాఖ అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అనుమతి ఇచ్చిందని పేర్కొంటూ మరో బాంబు  పేల్చింది.

నిజానికి జై షాపై కథనాన్ని ప్రచురించే ముందే ‘ద వైర్’ ఈ విషయంలో ఆయన వివరణను కోరుతూ లేఖ రాసింది. జై షా తరపు న్యాయవాది వివరణ ఇస్తూ కంపెనీలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదని, అంతా చట్టబద్ధంగానే ఉందని పేర్కొన్నారు. అంతేకాక జై షా పరువుకు భంగం కలిగించేలా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు ప్రచురిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాము వివరణతోపాటు, హెచ్చరించినా కథనాన్ని ప్రచురిస్తుందని భావించిన జై షా తాము వేయబోయే పరువునష్టం కేసులో వాదించేందుకు తుషార్ మెహతాకు న్యాయశాఖ అనుమతి ఇచ్చేలా పావులు కదిపినట్టు ‘ది వైర్’ తన తాజా కథనంలో పేర్కొంది. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని తెలిపింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న, ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న, కార్పొరేషన్ వ్యవస్థల తరపున తప్ప మరెవరి తరపునా ప్రభుత్వ లాయర్లు వాదించకూడదనే నిబంధన ఉంది. అయితే ఎటువంటి కారణాలు చూపించి జైషాకు ఈ అనుమతి ఇచ్చారన్న విషయం తెలియాల్సి ఉందని కథనంలో వివరించింది.

జై షా కంపెనీ టర్నోవర్ వేలాది రెట్లు పెరగడంపై ఇప్పటికే విరుచుకుపడుతున్న విపక్షాలకు ఇప్పుడు మరో ఆయుధం దొరికినట్టు అయింది. నిబంధనలు ఉల్లంఘించి సొలిసిటర్ జనరల్‌కు ఎలా అనుమతిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ విషయంలో మోదీ స్పందించాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్షాలు చుట్టుముట్టడంతో స్పందించిన కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. మెహతా గతంలోనూ అమిత్ షా కుటుంబం తరపున వాదించారని, అందుకే ఆయనకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు.

More Telugu News