ram gopal varma: ఒకే ఒక్క చాన్స్ కోసం రామోజీరావు ముందు తన ఆంగ్ల పరిజ్ఞానం ప్రదర్శించిన రామ్ గోపాల్ వర్మ... ఆపై ఏమైందో 30 ఏళ్ల తరువాత చెప్పాడు!

  • 'న్యూస్ టైమ్' పత్రికకు ఆర్టికల్ రాసిన ఆర్జీవీ
  • ఆపై కాలమిస్టునని చెప్పుకుంటూ రామోజీతో మాటలు
  • కావాలంటే పేపర్ లో ఉద్యోగమిస్తానని చెప్పిన 'ఈనాడు' అధినేత
  • 30 ఏళ్ల తరువాత సోషల్ మీడియాలో నాటి అనుభవం

మూడు దశాబ్దాల క్రితం, తనలోని టాలెంట్ పై తనకున్న నమ్మకంతో ఒక్క సినిమాకు దర్శకత్వం చేసే చాన్స్ ఇవ్వాలని అగ్ర నిర్మాత రామోజీరావు వద్దకు వెళ్లేందుకు తనలో ఉన్న ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆ తరువాత ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు వెల్లడించాడు.

 "దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ అప్పటికే 'శ్రీవారికి ప్రేమ లేఖ', 'మయూరి', 'ప్రతిఘటన' వంటి హిట్ చిత్రాలతో జోరు మీదున్న రామోజీరావును కలిస్తే, నాకు బెస్ట్ చాన్స్ లు ఉంటాయని భావించాను. అయితే, ఆయన్ను ఎలా కలవాలో తెలియలేదు. దీంతో ఓ ఆలోచన చేశాను. ఆయన నడుపుతున్న ఆంగ్ల దినపత్రిక 'న్యూస్ టైమ్'లో 'ది ఐడియా దట్ కిల్డ్ 50 మిలియన్ పీపుల్' అన్న పేరుతో ఓ ఆర్టికల్ రాశాను. అది ప్రచురితమైంది.

ఆపై నేను కాలమిస్టునని చెప్పుకుంటూ రామోజీరావు వద్దకు వెళ్లి, మనసులోని మాటను చెప్పాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. దర్శకుడికి ఇమాజినేషన్ ఉండాలని, ఆయన కింద పనిచేసే సాంకేతిక నిపుణులకు అనుభవం ఉంటే చాలని చెప్పిన నా మాటలను ఆయన అంగీకరించలేదు. నా వాదనను తోసిపుచ్చుతూ, కావాలంటే తన పేపర్ లో కాలమిస్టుగా ఉద్యోగం ఇస్తానని చెప్పారు.

ఏదిఏమైనా తొలిసారిగా నా పేరును పేపర్ పై చూసి స్నేహితులు, బంధువులు థ్రిల్ ఫీలయ్యారు" అని తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ఆ ఆర్డికల్ ఉన్న పేపర్ ను తాను పోగొట్టుకున్నానని, ఇటీవలే రాజా అనే తన స్నేహితుడు దాన్ని తెచ్చి ఇచ్చాడని చెబుతూ, ఆ ఆర్టికల్ ను తన అభిమానులతో పంచుకున్నారు.

More Telugu News