rains: కరవుదీరా వర్షాలు... తడిసి ముద్దవుతున్న రాయలసీమ!

  • రాత్రి నుంచి కురుస్తున్న వర్షం
  • ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
  • పొంగి పొరలుతున్న వాగులు, వంకలు
  • మరో రెండు రోజులు వర్షాలే

రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాయలసీమలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ వర్గాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొరలుతుండగా, పంట పొలాలు నీట మునిగాయి.

 మంత్రాలయం వద్ద తుంగభద్రా నది ఉప్పొంగి, పలు వంతెనలపై నుంచి ప్రవహిస్తుండగా, బెంగళూరు, కర్నూలు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచి, రహదారిపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిత్తూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పత్తికొండలో చిన్నకుంతీ వాగు, కొలిమిగుండ్ల సమీపంలో ఎర్రవాగు, చిప్పగిరి మండలంలో కడ్డీల వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గుంతకల్, ఆదోనీల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అనంతపురం పట్టణంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెద్దవడుగూరు మండలంలో పందుల వాగు ఉప్పొంగగా, పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, సాయం కావాల్సిన ప్రజలను ఆదుకుంటున్నామని అధికారులు తెలిపారు.

 వర్షాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. కడప ఆర్టీసీ గ్యారేజీలోకి నీరు చేరడంతో పలు బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజా వర్షాలతో రాయలసీమలోని పలు చిన్నా, పెద్ద చెరువుల్లోకి నీరు వచ్చి చేరడంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది.

ఒడిశా నుంచి చత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ విస్తరించి వున్న ఉపరితల ద్రోణి కారణంగానే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

More Telugu News