Singareni: సింగరేణిలో టీఆర్ఎస్ జెండా రెపరెపలు.. చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్ కార్మిక సంఘం!

  • చతికిల పడిన విపక్షాలు
  • పోటీ ఇవ్వలేకపోయిన ఏఐటీయూసీ
  • అన్ని డివిజన్లలోనూ 50 శాతం ఓట్లు సాధించి రికార్డు
  • కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమన్న మంత్రి తుమ్మల

సింగరేణి సిగలో ‘గులాబీ’ పూసింది. కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 11 డివిజన్లకు గాను 9 డివిజన్లలో విజయ ఢంకా మోగించింది. విపక్షాలు బలపరిచిన ఏఐటీయూసీ రెండు డివిజన్లకే పరిమితమైంది. 2012లో తొలిసారి ఉద్యమ వేడిలో గెలిచిన టీబీజీకేఎస్ ఈసారి ఏకంగా 9 డివిజన్లలో సత్తా చాటింది. ఫలితంగా ఈ ఏరియాల్లో గుర్తింపు సంఘంగా గౌరవం అందుకోనుంది.

గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ జరిగింది. 52,534 మందికిగాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు మొదలుపెట్టారు. రాత్రి బాగా పొద్దుపోయాక ఫలితాలు వెలువడ్డాయి. పోటీ పడిన అన్ని డివిజన్లలోనూ టీబీజీకేఎస్ 50 శాతానికిపైగా ఓట్లు సాధించి చరిత్ర సృష్టించింది. టీబీజీకేఎస్‌కు ఏఐటీయూసీ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సింగరేణిలో ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పాలనా దక్షతకు ఈ విజయం నిదర్శనమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు.
 

More Telugu News