dawood ibrahim: ఇండియా ఓకే చెప్పినా దావూద్ ఇబ్రహీం రాలేని పరిస్థితి: డాన్ సోదరుడు

  • ఐఎస్ఐ పంపే పరిస్థితి లేదు
  • పాక్ రహస్యాలు ఎన్నో దావూద్ కు తెలుసు
  • పోలీసుల విచారణలో ఇబ్రహీం కస్కర్

దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేయబోమని, ఎటువంటి విచారణ ఉండదని భారత్ హామీ ఇచ్చినా, ఆయన ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదని ప్రస్తుతం పోలీస్ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్న దావూద్ సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతానికి దావూద్ మనసులో ఇండియాకు రావాలన్న ఉద్దేశం లేదని తెలిపాడు.

 ఒకవేళ భారత్ సమ్మతించి, దావూద్ తిరిగి స్వదేశానికి వెళ్లాలని భావించినా, పాక్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) ఆయన్ను ఇండియాకు వెళ్లేందుకు అనుమతించబోదని అన్నాడు. పాక్ ఐఎస్ఐకి చెందిన ఎన్నో రహస్యాలు దావూద్ కు తెలుసుకాబట్టి, ఆయన్ను ఇండియాకు పంపే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డాడు.

కాగా, ఇటీవలి కాలంలో దావూద్ తిరిగి ఇండియాకు రావాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2015లో దావూద్ తనను సంప్రదించి, భారత్ కు రావాలన్న కోరికను వెల్లడించాడని సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలానీ వెల్లడించారు. దావూద్ ను తాను లండన్ లో కలిశానని, గృహ నిర్బంధంతో సరిపెడితే తాను ఇండియాకు వస్తానని చెప్పినట్టు జఠ్మలానీ పేర్కొన్నారు.

 ఇదిలావుండగా, ఓ బిల్డర్ ను బెదిరించి రూ. 3 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ఇక్బాల్ కస్కర్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. కస్కర్ ను విచారించిన పోలీసు అధికారులు, కరాచీలో దావూద్ పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నట్టు తమకు తెలిసిందని వెల్లడించారు.

More Telugu News