contract marriages: గతంలో మోసపోయిన మహిళలే ఇప్పుడు నిరుపేద ముస్లింలను మోసం చేస్తున్నారు!.. 'షేక్'ల పెళ్లిళ్లలో కొత్త కోణం!

  • గతంలో ఏజెంట్ల చేతిలో మోసపోయి షేక్ లను వివాహం చేసుకున్న మహిళలే ఏజెంట్లు
  • విదేశాల్లో షేక్ లతో మాట్లాడుకుని పాతబస్తీలో మకాం
  • పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి, గిఫ్టులతో ఆకట్టుకునే యత్నం 
  • నామమాత్రపు డబ్బులిచ్చి యువతుల జీవితాలు నాశనం చేస్తున్న వైనం 

ఇటీవల హైదరాబాదులో కాంట్రాక్టు పెళ్లిళ్ల స్కాం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఇందులో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుండగా, తాజాగా నిరుపేద ముస్లింలను గతంలో ఏజెంట్ల చేతిలో మోసపోయిన ముస్లిం మహిళలే మోసం చేయడం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టు వివాహాలతో విదేశాలకు వెళ్లి, అక్కడ బానిస బతుకులు బతికి, ఎన్నో ఇబ్బందులు పడిన ఆడపడుచులు కష్టనష్టాలకోర్చి, అక్కడే పెళ్లిళ్లు చేసే ఏజెంట్లుగా మారి తిరిగి హైదరాబాదు పాతబస్తీకి చేరుతున్నారు. తామెక్కడైతే నరకం చూశారో ఆ దేశాల్లోనే కొంతమంది కామాంధులైన పండుముసలి వారితో పెళ్లి కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నారు.

 ఏజెంట్లుగా అవతారమెత్తి అక్కడి నుంచి హైదరాబాదు చేరుకుంటున్నారు. ఇక్కడ పేద ముస్లిం కుటుంబాల గురించి తెలుసుకుంటున్నారు. ఆయా కుటుంబాలలోని యువతులకు చిన్నచిన్న గిఫ్టులు ఇచ్చి వారిని ఆకట్టుకుంటున్నారు. ఆ తరువాత వారి కుటుంబ సభ్యులను సంప్రదించి వారికి డబ్బు ఆశ చూపిస్తున్నారు. ఇక్కడంతా సెట్ అయిన తరువాత షేక్ తో డబ్బు బేరానికి దిగుతున్నారు.

ఆ డబ్బులో సగం నొక్కేసి, మిగిలిన సగంతో ఇక్కడ తంతంతా పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో వారికి ఖాజీలు సహాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి యువతులు అన్యాయమైపోతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ వివరాలన్నీ ఖాజీలు, బ్రోకర్లు, ఏజెంట్ల విచారణలో వెల్లడైనట్టు వారు తెలిపారు. దీంతో మరింత మందిని పట్టుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించినట్టు వారు తెలిపారు. 

More Telugu News