shirdi: షిర్డీ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి!

  • విమానాశ్రయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
  • ఇక ముంబై నుంచి 45 నిమిషాల్లోనే షిర్డీకి
  • ఎయిర్ బస్, బోయింగ్ విమానాలు దిగేందుకు అనుకూలం
  • ప్రస్తుతానికి పగటి పూట మాత్రమే విమాన సర్వీసులు

షిర్డీ సాయినాధుని మహా సమాధి జరిగి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతవత్సర మహాసమాధి ఉత్సవాలు ఏడాది పాటు సాగేలా మొదలైన శుభ తరుణంలో షిర్డీ విమానాశ్రయం జాతికి అంకితమైంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ షిర్డీ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. షిర్డీకి దగ్గర్లోని కాకడి గ్రామంలో మహారాష్ట్ర ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ కంపెనీ ఈ విమానాశ్రయాన్ని నిర్మించగా, ప్రస్తుతం కేవలం పగటి పూట మాత్రమే విమానాలు నడవనున్నాయి. త్వరలోనే ఇక్కడ రాత్రిపూట విమాన సర్వీసులు కూడా నడిపిస్తామని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.

ముంబై నుంచి షిర్డీకి 240 కిలోమీటర్ల దూరం ఉండగా, రైల్లో 9 గంటలు, రోడ్డు ద్వారా దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ఇక విమానంలో కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే రెండు నగరాల మధ్య ప్రయాణం సాగించవచ్చు. ఎయిర్ బస్ ఏ-320, బోయింగ్ 737 విమానాలు దిగేందుకు అనువైన రన్ వేను ఇక్కడ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

షిర్డీకి విమానాలు నడిపేందుకు అన్ని ప్రముఖ విమానయాన సంస్థలూ ఆసక్తిని చూపుతున్నాయి. త్వరలోనే స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఇండిగో తదితర సంస్థలు ముంబై, హైదరాబాద్, నాగపూర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి షిర్డీకి విమానాలు నడిపేందుకు నిర్ణయించుకున్నాయి. ఈ విమానాశ్రయానికి 2010లోనే అనుమతులు వచ్చాయి. ప్రతియేటా షిర్డీకి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఈ విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News