rahul gandhi: గుజరాత్ లో ఓపెన్ టాప్ జీపుపై ప్రచారానికి పోలీసుల అనుమతి నిరాకరణ.. ఎద్దుల బండెక్కిన రాహుల్ గాంధీ!

  • గుజరాత్ లో ఉత్సాహంగా సాగుతున్న రాహుల్ గాంధీ రోడ్ షో 
  • తొలి దశలో ద్వారక నుంచి జామ్ నగర్ కు పయనం
  • ప్రజలతో మమేకమవుతూ సాగుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, ప్రచారానికి వెళ్లి, ఓపెన్ టాప్ జీపుపై ఎక్కి రోడ్ షోను నిర్వహించాలని భావించిన రాహుల్ గాంధీకి చుక్కెదురవడంతో ఆయన వినూత్న నిర్ణయం తీసుకున్నారు. రోడ్ షోకు పోలీసులు అనుమతించక పోవడంతో, ఓ ఎద్దుల బండెక్కి తన రోడ్ షోను ఆయన కొనసాగించారు. కీలకమైన సౌరాష్ట్ర ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించి, ప్రచారం నిర్వహించాలని భావించిన ఆయన, కాంగ్రెస్ విజయానికి సౌరాష్ట్ర కీలకమని భావిస్తున్నారు.

ఇక ఉదయాన్నే ద్వారకాదీశ్ కృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన, జామ్ నగర్ కు బయలుదేరి స్థానికులతో మమేకమవుతూ యాత్రను కొనసాగించారు. మహిళలు, చిరు వ్యాపారులు కనిపించినప్పుడు వారి క్షేమసమాచారాలు అడిగారు. విద్యాసంస్థల్లోకి వెళ్లి అక్కడి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ద్వారక నుంచి జామ్ నగర్ కు 135 కిలోమీటర్ల దూరాన్ని జీపులో వెళ్లాలని ఆయన తొలుత అనుకోగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ పోలీసులు నిరాకరించారని తెలుస్తోంది.

ఆపై జాతీయ రహదారిపై ప్రత్యేక లగ్జరీ బస్సులో, జనావాస ప్రాంతాల్లో ఎద్దుల బండిపై ఆయన యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా బీజేపీ అధికారంలో ఉండగా, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.  

More Telugu News