లేదు.. ఆ వార్తలు అబద్ధం.. ఎన్డీటీవీ విక్రయ వార్తలను ఖండించిన యాజమాన్యం
- అందులో ఒక్క లైన్ కూడా నిజం కాదు
- స్పష్టం చేసిన సీనియర్ అధికారులు
- బీఎస్‌ఈకి నోట్ పంపిన యాజమాన్యం
1988లో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ప్రారంభించిన ఎన్‌డీటీవీ త్వరలో చేతులు మారబోతోందంటూ వార్తలు వచ్చాయి. స్పైస్‌జెట్ అధినేత అజయ్ సింగ్ దీనిని కొనుగోలు చేయనున్నట్టు వచ్చిన వార్తలు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. ఈ వార్తలతో ఎన్‌డీటీవీ షేరు ఒక్కసారిగా 5 శాతం లాభపడింది. డీల్ తర్వాత అజయ్ సింగ్‌కు 40 శాతం, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు 20 శాతం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌డీటీవీకి కష్టాలు మొదలైనట్టు చెబుతున్నారు. జూన్ 5న ప్రణయ్ రాయ్ నివాసాలపై సీబీఐ దాడులు చేసింది. మరోవైపు ఎన్‌డీటీవీ గత దశాబ్ద కాలంగా లాభాలు చూసింది లేదు. రూ.1,474 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విక్రయానికే మొగ్గు చూపినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు సంస్థను కొనుగోలు చేయాలని భావిస్తున్న అజయ్ సింగ్ బీజేపీకి చాలా సన్నిహితుడు కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అంతేకాదు ప్రధాని మోదీ అంతరంగికుల్లో ఒకరు కూడా. ఈ నేపథ్యంలో ఎన్‌డీటీవీ విక్రయ వార్తలు మార్కెట్లో పెను సంచలనం కలిగించాయి.