sadavati lands: సాక్షి పేపర్ లో రాసింది చూసి మా వాళ్లు భయపడిపోయారు.. అందుకే డబ్బులు చెల్లించలేదు: సదావర్తి భూముల వేలం పాటదారు

  • వైసీపీ నేతల ఆరోపణలు బాధాకరమన్న వేలంపాటదారు
  • సాక్షి పత్రిక కథనంతో మా వాళ్లు భయపడిపోయారు
  • 10 మంది కలసి సిండికేట్ గా వేలం పాడాం
  • ఈ భూములు మాకు వద్దు
  • డిపాజిట్ కోల్పోవడానికి కూడా సిద్ధమే

సుప్రీంకోర్టు ఆదేశాలతో సదావర్తి భూములకు జరిగిన వేలంపాటలో కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డి రూ. 60.30 కోట్లతో భూములను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం లోపల ఇందులో సగం డబ్బును చెల్లించాల్సి ఉంది. అయితే ఆయన చెల్లించలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 10 మంది వ్యాపారవేత్తలం కలసి ఒక సిండికేట్ గా ఈ వేలంలో పాల్గొన్నామని... వేలంపాటలో పాడిన డబ్బును చెల్లించేందుకు తాము ఇప్పటికీ సిద్ధమేనని చెప్పారు.

 కానీ వైసీపీ నేతలు తమపై దారుణమైన ఆరోపణలు చేశారని...  తమ వేలం పాటకు సంబంధించి టీడీపీని, లోకేష్ ను, మంత్రి ఆది నారాయణరెడ్డిని మధ్యలోకి తీసుకొచ్చారని అన్నారు. తమకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు చేసిన ప్రచారంతో, తమ భాగస్వాములంతా భయపడిపోయారని... భూములను వదులుకోవడమే బెస్ట్ అని డిసైడ్ అయ్యారని చెప్పారు. రాజకీయంగా తమకు సంబంధాలు ఉన్నప్పటికీ, తాము ప్రధానంగా వ్యాపారస్తులమేనని తెలిపారు.

ఈనాటి సాక్షి పేపర్ లో తమ గురించి ఎంత దారుణంగా రాశారో చూడాలని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తాము ఓపెన్ ఆక్షన్ లో పాట పాడామని... ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తాము భూమిని సొంతం చేసుకొని వ్యాపారం చేయలేమని తెలిపారు. ఈ డబ్బును తాము చెల్లించని పక్షంలో... డిపాజిట్ మొత్తాన్ని తాము కోల్పోవాల్సి ఉంటుందని, దానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. తాము విత్ డ్రా అయితే... అధిక ధర కోట్ చేసిన రెండో వ్యక్తికి భూములను అప్పగిస్తామంటూ, వేలంపాట సమయంలో అధికారులు క్లియర్ గా చెప్పారని గుర్తు చేశారు. 

More Telugu News