ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. డిసెంబర్ లో ఏపీకి రానున్న బిల్ గేట్స్

20-09-2017 Wed 12:07
  • అరగంట ఆలస్యంగా వచ్చినా క్షమిస్తా.. మొత్తానికి ఎగ్గొడితే ఊరుకోను
  • నేను కూడా బయోమెట్రిక్ ఉపయోగిస్తున్నా
  • ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉంది
  • మంచి పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలి
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు అరగంట ఆలస్యంగా కార్యాలయాలకు వచ్చినా సహిస్తానని... మొత్తానికే ఎగ్గొడితే క్షమించబోనని హెచ్చరించారు. తాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా బయోమెట్రిక్ ను వినియోగిస్తున్నామని... ప్రతి ఒక్కరికీ హాజరు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. కొన్ని శాఖలు ఏం పని చేస్తున్నాయో కూడా అర్థం కావడం లేదని మండిపడ్డారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయరంగానికి చెందిన ఫైళ్లు ఇతర శాఖలకు వెళ్లకుండా చూడాలని, సేవా రంగంపై దృష్టి సారించాలని ఆదేశించారు. డిసెంబర్ నెలలో ఏపీకి బిల్ గేట్స్ వస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని  చంద్రబాబు తెలిపారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలోకి వస్తే 30 ఏళ్లపాటు ఉంటారని... కానీ, తాము మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని, మంచి పాలన అందిస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. 2014 ఎన్నికల్లో 1.6 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, కానీ, ఉప ఎన్నికలో 16 శాతం ఓట్ల తేడాతో గెలిచామని తెలిపారు. మంచి పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు.