rahul gandhi: నరేంద్ర మోదీ ఆలోచనను మెచ్చుకుంటూనే మెత్తగా మొట్టిన రాహుల్ గాంధీ

  • మేకిన్ ఇండియా ఆలోచన మంచిదే
  • కానీ చిన్న, మధ్య తరగతి వ్యాపారానికి ఊతమేది?
  • నిత్యమూ 30 వేల మంది నిరుద్యోగులు పుడుతున్నారు
  • 450 మందికే ఉపాధి లభిస్తోంది
  • మోదీ సర్కారుపై యువతలో పెరుగుతున్న ఆగ్రహం
  • ప్రిన్సిటన్ వర్శిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రిన్సిటన్ యూనివర్శిటీలో ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలను ప్రస్తావించి, అవి విజయవంతం కావాలని కోరుకున్నట్టు తెలిపారు. "నేను మేకిన్ ఇండియా కాన్సెప్ట్ ను అంగీకరిస్తున్నాను. అది మంచి ఆలోచన. అయితే, అది ఎవరినైతే లక్ష్యంగా చేసుకోవాలో వారికి దగ్గర కావడం లేదు. నేనైతే మరోలా చేసుండేవాడిని" అని వ్యాఖ్యానించారు.

"ఈ ఆలోచనతో భారీ ఎత్తున వ్యాపార అవకాశాలు వస్తాయని మోదీ అనుకుంటున్నారు. నేను మాత్రం చిన్న, మధ్య తరహా కంపెనీల వ్యాపారాన్ని పెంచాలని అనుకుంటున్నా. ఈ రంగంలోనే ఉపాధి అవకాశాలు పెరగాల్సి వుంది" అని 47 ఏళ్ల రాహుల్ గాంధీ, వర్శిటీ విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. నిత్యమూ కనీసం 30 వేల మంది ఉద్యోగం కోసం వీధుల్లోకి వస్తుంటే, కేవలం 450 మందికే ఉపాధి దొరుకుతోందని అన్నారు.

"భారత యువతలో ప్రస్తుతం ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇది నేను కనిపెట్టాను. ప్రజాస్వామ్య వాతావరణంలో ఈ సమస్యను పరిష్కరించాలి. మోదీ ప్రభుత్వం ముందున్న పెద్ద చాలెంజ్ అదే" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవంగా చెప్పాలంటే, తమ పార్టీ ఈ పని చేయలేకపోయిందని, మోదీ కూడా చేయలేకపోతున్నారని విమర్శించారు. సమస్య తీవ్రత చాలా అధికంగా ఉండటమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. తొలుత సమస్య ఉందని అంగీకరించాలని, ఆపై దాన్ని నివారించే దిశగా కృషి చేయాల్సి వుందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సమస్య ఉందని కూడా అంగీకరించేందుకు సిద్ధంగా లేదని దుయ్యబట్టారు.

మోదీని తాను విమర్శించడానికి కారణాలను చెబుతూ, "ఇండియాలో అసంఖ్యాకులకు ఉపాధి లేదు. వారికి భవిష్యత్తు కనిపించడం లేదు. వారంతా బాధను అనుభవిస్తుంటే, వారికి ఈ నేతలు ఉపాధి కల్పించడంలో విఫలం అవుతున్నారు. అమెరికాలో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. నిరుద్యోగ సమస్యను ట్రంప్ ఎలా పరిష్కరిస్తున్నారన్న విషయమై నాకు అవగాహన లేదు. కానీ, మా ప్రధాని మాత్రం సరైన దిశలో సాగడం లేదు" అని అన్నారు. ఉద్యోగ సృష్టిపై కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ పెద్దగా ఏమీ చేయలేకపోయామని రాహుల్ అంగీకరించడం గమనార్హం. రోజుకు 30 వేల ఉద్యోగాలను కల్పించలేకపోవడమే తమ పార్టీని అధికారానికి దూరం చేసిందన్న రాహుల్, అదే ఆగ్రహం ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై పెరుగుతోందని వ్యాఖ్యానించారు.

More Telugu News