హ్యాక‌ర్ల దాడికి గురైన సీక్లీన‌ర్‌.... ప్ర‌మాదంలో ప‌డ్డ 2 మిలియ‌న్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు

18-09-2017 Mon 18:21
  • స్ప‌ష్టం చేసిన పిరిఫార్మ్ కంపెనీ
  • వినియోగ‌దారుల వివ‌రాలు సేక‌రిస్తున్న హ్యాక‌ర్లు
  • సాఫ్ట్‌వేర్ తొల‌గించి, మ‌ళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్ర‌క‌ట‌న
కంప్యూట‌ర్లు, స్మార్ట్‌ఫోన్‌ల‌లో జంక్ ఫైళ్ల‌ను, బ్రౌజ‌ర్ హిస్ట‌రీల‌ను, క్యాషే ఫైళ్ల‌ను, కుకీల‌ను డిలీట్ చేసేందుకు ఎక్కువ మంది ఉపయోగించే సీక్లీన‌ర్ సాఫ్ట్‌వేర్ హ్యాక‌ర్ల దాడికి గురైంది. గ‌త ఆగ‌స్టులో విడుద‌ల చేసిన వెర్ష‌న్ 5.33.6162, సీక్లీన‌ర్ క్లౌడ్ వెర్ష‌న్ 1.07.3191 సాఫ్ట్‌వేర్ల మీద హ్యాక‌ర్లు దాడి చేసిన‌ట్లు సీక్లీన‌ర్ మాతృ సంస్థ పిరిఫార్మ్ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం సీక్లీన‌ర్ అప్‌డేట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న అవాస్ట్ కంపెనీ కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. ఈ రెండు వెర్ష‌న్ల‌ను ఇప్ప‌టికి 2.27 మిలియ‌న్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

అయితే హ్యాక్‌కి గురైంద‌న్న సంగ‌తి తెలిసిన వెంట‌నే అప్‌డేట్‌ను ఆపేసిన‌ట్లు అవాస్ట్ తెలిపింది. అలాగే కొత్త వెర్షన్‌ను కూడా డౌన్‌లోడ్‌కి సిద్ధంగా ఉంచిన‌ట్లు కంపెనీ తెలిపింది. ప్ర‌స్తుతం వినియోగ‌దారులంద‌రూ పాత సీక్లీన‌ర్ వెర్ష‌న్‌ని డిలీట్ చేసి, కొత్త‌ది ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని సూచించింది. అయితే హ్యాక్ కు గురైన వెర్ష‌న్ల వ‌ల్ల ప్ర‌మాదం ఎదురైన‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు రాలేద‌ని పేర్కొంది. హ్యాక‌ర్లు కేవ‌లం వినియోగ‌దారుల వివ‌రాలు మాత్ర‌మే సేక‌రించి ఉంటార‌ని వారు చెబుతున్నారు.