sadavarti: బహిరంగ వేలంలో రికార్డు ధర పలికిన సదావర్తి భూములు!

  • సదావర్తి భూముల వేలం.. భారీ ధర పలికిన వైనం 
  • వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్ ఫలితం
  • టీటీడీకి భారీ ఆదాయం సమకూర్చిన సదావర్తి భూములు
  • గతంలో కేవలం 22 కోట్లే.. ఇప్పుడు 60 కోట్ల 30 లక్షలు

చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో సదావర్తి భూముల వేలం జరుగుతోంది. దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో ఈ భూముల వేలం జరుగుతోంది. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో 22 కోట్ల రూపాయలకు విక్రయించింది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎంతో విలువైన సదావర్తి భూమలను కారుచౌకగా కట్టబెట్టారంటూ తన పిటిషన్ లో ఆరోపించారు.

దీనిని విచారించిన హైకోర్టు 22 కోట్ల రూపాయలకు అదనంగా 5 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆ భూములను మీరే సొంతం చేసుకోవచ్చంటూ ఆయనకు సరికొత్త ఆఫర్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన ముందుకు రావడంతో ధరావత్తు చెల్లించాలని సూచించింది. హైకోర్టు చెప్పినట్టుగానే ఆయన చెల్లించారు. అయితే, మరొకరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, బహిరంగ టెండర్ ఆహ్వానిస్తూ వేలం వేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

దీంతో 6 సీల్డ్ టెండర్ కవర్లతో పాటు, 2 ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు ఈ భూముల కొనుగోలుకు దాఖలయ్యాయి. అనంతరం సదావర్తి భూముల బహిరంగ వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఈ వేలంలో 60 కోట్ల 30 లక్షల రూపాయలకు భూములు అమ్ముడయ్యాయి. టోకెన్ నెంబర్ 10 ఈ మొత్తానికి భూములు కొనుగోలు చేసింది. 

More Telugu News