Lashker-e-Taiba: లష్కరే తాయిబా చీఫ్‌గా స్థానిక కశ్మీర్ ఉగ్రవాది.. చక్కర్లు కొడుతున్న జీనత్ పేరు!

  • తమకు సమాచారం లేదన్న ఇంటెలిజెన్స్
  • అదే జరిగితే తొలి కశ్మీరీగా రికార్డు
  • మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో జీనత్ పేరు

పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ) చీఫ్‌గా కశ్మీర్‌కు చెందిన స్థానిక ఉగ్రవాది జీనత్-ఉల్-ఇస్లాం నియమితుడయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పేరు ఉగ్రవాదుల్లో చక్కర్లు కొడుతోంది. ఎల్‌ఈటీ టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్థానంలో జీనత్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆయనకే కనుక ఎల్‌ఈటీ పగ్గాలు అందితే తొలి కశ్మీరీగా రికార్డులకెక్కుతాడు.

జీనత్ పట్టాభిషేకం ఖాయమని సోషల్ మీడియా కోడై కూస్తుండగా, ఇందుకు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తమకు తెలిసినంత వరకు లష్కరే చీఫ్‌గా స్థానికుడెవరూ ఇప్పటి వరకు లష్కరే పగ్గాలు చేపట్టలేదని పేర్కొన్నాయి. ఇక ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దామని తెలిపాయి. అయితే జమ్ముకశ్మీర్ పోలీసులు మాత్రం జీనత్‌కు పట్టాభిషేకం తప్పదని చెబుతున్నారు.

సోషియాన్  ప్రాంతంలోని సుగాన్ జానిపురాకు చెందిన 28 ఏళ్ల జీనత్‌కు బాంబు ( ఐఈడీలు)ల తయారీలో మంచి నైపుణ్యం ఉంది. గతంలో రెండేళ్లపాటు అల్-బద్ర్‌లో పనిచేశాడు. ఇటీవల సోషియాన్‌లో సైనికులపై జరిగిన దాడిలో జీనత్ ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. కాగా, ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో జీనత్ కూడా ఒకడు.

More Telugu News