North korea: ఇప్పుడు దక్షిణ కొరియా వంతు.. నార్త్ కొరియాను సర్వనాశనం చేస్తామంటూ హెచ్చరిక!

  • రంగంలోకి దక్షిణ కొరియా
  • రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హితవు
  • చర్చలు కోసం మార్గం వెతుక్కోవాలని సూచన

ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలు ఉత్తర కొరియా నాశనానికి కారణమవుతాయని అధ్యక్షుడు మూన్ జే-ఇన్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి చర్చలు ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు. ‘‘ఒకవేళ ఉత్తర కొరియా కనుక మమ్మల్ని, మా మిత్రదేశాలను రెచ్చగొట్టే చర్యలకు దిగితే ఆ దేశాన్ని సర్వనాశనం చేసే సత్తా మాకు ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ఉత్తర కొరియా శుక్రవారం ఈ నెలలో రెండో క్షిపణి పరీక్షను నిర్వహించింది. అది జపాన్ మీదుగా ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో జపాన్‌కు తూర్పున 2వేల కిలోమీటర్ల దూరంలో పడింది. ఈ ఘటన జరిగిన వెంటనే దక్షిణ కొరియా  ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్‌సీ)తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మూన్ మాట్లాడుతూ ఉత్తర కొరియా చర్యను ఖండించారు.

పోంగ్యాంగ్ మరోమారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదనలను తుంగలో తొక్కిందని మూన్ పేర్కొన్నారు. తద్వారా కొరియా ద్వీపకల్పంతోపాటు ప్రపంచ శాంతి, సుస్థిరతకు తీవ్ర విఘాతం కలిగించిందని ఆయన వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. అయితే  ఉత్తర కొరియాకు మరో దారి లేదని, నిజాయతీగా, నిబద్ధతతో చర్చల కోసం ముందుకు రాక తప్పదని మూన్ పేర్కొన్నారు.

More Telugu News