: రోడ్డుపై ఏనుగు వెళ్తుంటే కుక్క‌లు మొరుగుతాయి.. ప‌ట్టించుకోవ‌ద్దు: ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్టుపై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సెటైర్

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ గ‌తంలో స్వ‌చ్ఛ భార‌త్‌లో పాల్గొంటుండ‌గా తీసిన ఓ ఫొటోని ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ కోహ్లీని రోడ్లు ఊడ్చేవాడిగా పేర్కొన్న విష‌యం తెలిసిందే. లాహోర్‌లో పాకిస్థాన్ వ‌ర్సెస్ వ‌రల్డ్ ఎలెవ‌న్ క్రికెట్‌ మ్యాచులు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో కోహ్లీ స్టేడియాన్ని ఊడ్చుతున్నాడ‌ని అందులో ఆ జ‌ర్న‌లిస్టు పేర్కొన్నాడు. దీనిపై కోహ్లీ అభిమానులు మండిప‌డి ఆస్ట్రేలియా మీడియాపై తిట్ల‌దండ‌కం కూడా చేశారు. ఆ ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్టు డెన్నిస్ ఫ్రీడ్‌మెన్ పై తాజాగా టీమిండియా క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా మండిప‌డ్డాడు.

కోహ్లీ అభిమానులు ఆ జ‌ర్న‌లిస్టుని విమ‌ర్శించ‌డం స‌రైందేన‌ని హర్భజన్ అన్నాడు. అటువంటి కామెంట్ చేసినందుకు ఆ జ‌ర్న‌లిస్టు సిగ్గుప‌డాల‌ని వ్యాఖ్యానించాడు. ఆ జ‌ర్న‌లిస్టు త‌న గౌర‌వాన్ని కాపాడుకోవాల‌ని, ఇటువంటి వ్యాఖ్య‌లు చేసి ఒక‌రిని కించ‌ప‌ర్చాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ ప్ర‌శ్నించాడు. ఆస్ట్రేలియన్‌, పాకిస్థానియ‌న్‌, ఇండియ‌న్ ఇలా మ‌నం ఎవ‌ర‌యినా స‌రే మ‌న‌మంతా మ‌నుషుల‌మేన‌ని గుర్తుంచుకోవాల‌ని హిత‌వు ప‌లికాడు.

ఇటువంటి కామెంట్ల‌పై విరాట్ కోహ్లీ స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఏనుగు రోడ్డుపై వెళుతోంటే ఎన్నో కుక్కలు దాన్ని చూసి మొరుగుతూనే ఉంటాయ‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ ఏనుగులాంటి వాడ‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నాడు. ఈ వివాదం త‌లెత్తిన నేప‌థ్యంలో కోహ్లీకి మ‌ద్ద‌తుగా భార‌త అభిమానుల‌తో పాటు కోహ్లీ పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఆస్ట్రేలియా జ‌ర్న‌లిస్టును ఇంకా తిడుతూనే ఉన్నారు. 

More Telugu News