: తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి... పుణె ఎంఐటీలో అత్యుత్తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసాచారి!

మహారాష్ట్రలోని పుణె ఎంఐటీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ లో 2016-17 సంవత్సరానికి మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ గవర్నమెంట్‌ (ఎంపీజీ) కోర్సులో ప్రవేశం పొందిన ఏకైక తెలంగాణ వ్యక్తి వంగీపురం శ్రీనివాసాచారికి అరుదైన ఘనత లభించింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆయన, 'బెస్ట్‌ పార్టిసిపెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డును గెలుచుకోగా, ఎంఐటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవా గవర్నర్‌ మృదులా సిన్హా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు బంగారు పతకాన్ని కూడా ఆయనకు బహూకరించారు.

 పొలిటికల్‌ లీడర్‌ షిప్‌ రంగంలో వన్ ఇయర్ ఫుల్ టైమ్ అకాడమిక్‌ కోర్స్ ను అందించే ఒకే ఒక్క స్కూల్ గా ఉన్న ఎంఐటీ 12వ బ్యాచ్‌ లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులకు ప్రవేశం దక్కింది. ఇందులో భాగంగా నిర్వహించిన పలు ప్రజెంటేషన్స్‌, ఇంటర్న్‌ షిప్‌ ప్రాజెక్టుల్లో శ్రీనివాసాచారి ఉత్తమ ప్రతిభను కనబరిచారని వర్శిటీ ప్రొఫెసర్లు వ్యాఖ్యానించారు. కాగా, శ్రీనివాసాచారి స్వగ్రామం నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెద్ద ముద్దునూరు. టీచింగ్ తో పాటు శిక్షణ, పరిపాలన రంగాల్లో అనుభవమున్న ఆయన, పలు అంశాలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో కథనాలుగా వచ్చాయి. పలు టీవీ చానళ్లు నిర్వహించిన చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. ఈ అవార్డు రావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా శ్రీనివాసాచారి వ్యాఖ్యానించారు.

More Telugu News