: సాంకేతిక కారణాలతోనే జీడీపీ తగ్గింది: అమిత్ షా వివరణ

గడచిన త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి రేటు 5.7 శాతానికి పడిపోవడం కేవలం సాంకేతిక కారణాల వల్లే జరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యూపీఏ ప్రభుత్వం పాలించిన 2013-14లో 4.7 శాతానికి పడిపోయిన జీడీపీని తాము 7.1 శాతానికి పెంచామని అన్నారు.

 కేవలం ఉత్పత్తి, సేవలు, మౌలిక వసతులను మాత్రమే ప్రతిబింబించేలా ఉన్న జీడీపీ గణాంకాలను ప్రజా జీవనం కూడా ప్రతిబింబించేలా తాము చేశామని ఆయన అన్నారు. పేదలకు తాము ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను ఇస్తున్నామని, ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని, ప్రతి ఒక్కరికీ ఇప్పుడు బ్యాంకు ఖాతాలున్నాయని, కొత్తగా చేబట్టిన మరుగుదొడ్ల నిర్మాణం కూడా జీడీపీపై ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో కరెంటు ఖాతాల లోటు 5 శాతం వరకూ పెరిగిందని, ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యకు చేరుకుందని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో మూడేళ్ల కనిష్ఠానికి జీడీపీ పడిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News