: గుర్మీత్ ఆసుపత్రిలో అక్రమంగా అవయవ మార్పిడి.. విస్తుగొలిపే నిజాలు వెల్లడి

అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలుకు వెళ్లాక అప్పటివరకు డేరాలో జరిగిన అక్రమ, అసాంఘిక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో విస్తుగొలిపే వాస్తవం బయటపడింది. డేరా హెడ్‌క్వార్టర్స్ సిర్సాలోని ఆసుపత్రిలో అక్రమంగా అవయవ మార్పిడి ఆపరేషన్లు, మూలకణ చికిత్సలు నిర్వహించినట్టు బయటపడింది.

డేరా వెబ్‌సైట్ ప్రకారం షా సత్నమ్ జీ స్పెషాలిటీ ఆసుపత్రి 1.25 లక్షల చదరపు అడుగులలో విస్తరించి ఉంది. అత్యద్భుత సౌకర్యాలు ఉన్నాయి. అవయవ మార్పిడి సౌకర్యం కూడా ఉంది. కార్నియల్, అవయ మార్పిడి శస్త్రచికిత్స ఇక్కడ అందుబాటులో ఉంది.. అని వెబ్‌సైట్ పేర్కొంది. ఇది అక్రమమని అధికారులు పేర్కొన్నారు.

ట్రాన్స్‌ప్లాంట్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ ప్రకారం ఆసుపత్రిలో అవయవ మార్పిడి చేయాలన్నా, ఐ బ్యాంకు నిర్వహించాలన్నా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ), లేదంటే రీజనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఆర్ఓటీటీఓ) వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అయితే వీటిలో ఏ ఒక్క రిజిస్ట్రేషన్ ఆసుపత్రికి లేదని ఎన్ఓటీటీవో డైరెక్టర్ డాక్టర్ విమల్ భండారీ తెలిపారు. మరోవైపు సిర్సా ఆసుపత్రిలో పనిచేస్తున్న 150 మంది వైద్యుల్లో ఒక్కరంటే ఒక్కరికి మాత్రమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)లో సభ్యత్వం ఉండడం గమనార్హం.

More Telugu News