: ఆ కమిటీ నివేదికను ఏపీ ప్రభుత్వం గౌరవించినట్టయితే బాగుండేది: ఐవైఆర్ కృష్ణారావు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 270 ఎకరాల స్థలం సరిపోతుందని చెప్పిన శివరామకృష్ణ కమిటీ నివేదికను ప్రభుత్వం గౌరవించినట్టయితే బాగుండేదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. విజయవాడలో ‘పర్యావరణం-అమరావతి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, అమరావతి కలల రాజధాని అని, పరిపాలనాపరమైన చిన్న నగరాలతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

శివరామకృష్ణ కమిటీ కూడా అదే విషయం చెప్పిందని అన్నారు. ఒక పట్టణంలో ఐదు నుంచి పది లక్షల జనాభా చేరాలంటే కనీసం 40 సంవత్సరాలు పడుతుందని అన్నారు. చీఫ్ సెక్రటరీకి కొన్ని పరిమితులు ఉంటాయని, అమరావతి విషయంలో అందుకే నాడు బహిరంగంగా స్పందించలేదని, రాజధాని భూ సేకరణ విషయంలో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. సామాజిక పర్యావరణ సర్వే సరిగా జరగలేదని, రాజధాని భూ సమీకరణ విఫల ప్రయోగమని విమర్శించిన ఆయన, భూ సమీకరణకు ఒప్పుకోకపోతే భూ సేకరణ చేస్తామనడం చట్ట విరుద్ధం అని అన్నారు. విజయవాడ, గుంటూరులలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, అటవీభూములను రాజధానికి వినియోగిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అన్నారు.

More Telugu News