: హైదరాబాద్ మెట్రో ప్రారంభ తేదీ ఖరారు... మోదీకి ఆహ్వానం పంపిన కేసీఆర్!

హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే మెట్రో రైల్ సేవల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నాగోలు నుంచి సికింద్రాబాద్, బేగంపేట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి మీదుగా మియాపూర్ వరకూ తొలి దశ రైళ్లు నడవనున్నాయి. నవంబర్ 28న మెట్రో ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించామని తెలుపుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. ఆ లేఖను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. మొత్తం 30 కిలోమీటర్ల పొడవైన రవాణా మార్గం అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.

కాగా, "నేను మే 25న మిమ్మల్ని కలిసి నవంబర్ లో మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని కోరాను. నేను మరోసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సుమారు రూ. 15 వేల కోట్ల మూలధనం పెట్టుబడితో, దేశంలోనే అతిపెద్ద పీపీపీగా నిర్మితమైన ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నాను" అని కేసీఆర్ ఈ లేఖలో పేర్కొన్నారు.

నవంబర్ 28 నుంచి 30 వరకూ జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సును ప్రారంభించేందుకు మోదీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, యూఎస్ డెలిగేషన్ కు నేతృత్వం వహించనున్నారు. మోదీ పర్యటనలోనే మెట్రో రైల్ ను కూడా ప్రారంభించాలని భావించిన కేసీఆర్, ఈ మేరకు ఆయనకు ఈ లేఖను రాశారు.

More Telugu News