: ప్ర‌పంచం ఎప్పుడూ మ‌న‌కు న‌చ్చిన‌ట్లుగా ఉండ‌దు... కుక్క‌ల అరుపుల‌ను మ‌నం ఆప‌లేం!: నాగ‌బాబు

`కుక్క‌ల అరుపు నాకు ఇష్టం ఉండ‌దు. అలాగని దాన్ని నియంత్రించాల‌నుకోవడం పొర‌పాటు. ఎందుకంటే ప్రపంచంలో మనకు ఇష్టం లేనివి ఎన్నో జరుగుతుంటాయి. అవి జ‌ర‌గ‌కూడ‌దు అనుకుంటే క‌ష్టం` అని న‌టుడు నాగబాబు అన్నారు. అరుస్తున్న ప్ర‌తి కుక్క‌ని మ‌నం నియంత్రించ‌లేమ‌ని, వాటిని ప‌ట్టించుకోకుండా జీవితంలో పైకి ఎద‌గ‌డంపై దృష్టి సారించాల‌ని ఆయ‌న తెలిపారు. `మా నాన్న చ‌నిపోవ‌డం నాకు ఇష్టం లేదు. నేను ఆప‌గ‌లిగానా?, ఆయన చనిపోయారు. ఆ బాధను దిగమింగుకుని, మామూలుగా బ్రతికేస్తున్నాం. అన్ని విష‌యాల్లోనూ ఇలాగే ఉండాలి` అని నాగబాబు అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాల‌ను పంచుకున్నారు. ఇందులో భాగంగా మెగా ఫ్యాన్స్ వీరంగం గురించి కూడా ఆయ‌న మాట్లాడారు.

`వారికి వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని మాట్లాడితే తప్పులేదు, అలా మాట్లాడేవాళ్లు ఎవరైనా సరే వారి మాటల వల్ల వచ్చే ప‌రిణామాల‌కు కూడా సిద్ధంగా ఉండాలి. ఏది ప‌డితే అది మాట్లాడే హ‌క్కు మీకుంటే, ఏది ప‌డితే అది చేసే హ‌క్కు అభిమానుల‌కు కూడా ఉంటుంది. కాక‌పోతే వాళ్లు వాడే ప‌ద‌జాలంలో కొంత మార్పు ఉంటుంది` అని నాగ‌బాబు అన్నారు.

అయినా మెగా ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని మాట్లాడే ప్ర‌తి ఒక్కరూ చేసే ప‌నుల‌కు తాము స‌మాధానం చెప్ప‌డం సాధ్యం కాద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌తి చిన్న విష‌యం మీద దృష్టి సారించ‌కుండా, భ‌విష్య‌త్తులో కల్యాణ్ బాబుకు రాజకీయంగా ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయాల‌ని అభిమానుల‌కు సూచించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అభిమానులు రాను రాను త‌మ హీరోను అధిగ‌మించే స్థాయికి చేరుకుని, అత‌న్ని నియంత్రించే స్థాయికి ఎదుగుతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌తంలో త‌మిళ న‌టుడు ఎంజీఆర్ అభిమానులు ఆయన్ని నియంత్రించిన సంద‌ర్భాల‌ను ఆయ‌న గుర్తుచేశారు. వారిని ఆపే శ‌క్తి ఎవ‌రికీ ఉండ‌దని, సంయ‌మ‌నం పాటించండ‌ని చెప్ప‌డం మిన‌హా హీరోలు ఏం చేయలేర‌ని నాగ‌బాబు వివ‌రించారు. త‌మ అభిమాన హీరోని విమర్శించిన వారికి విజ‌యం ద్వారా మాత్ర‌మే స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

More Telugu News